
సంక్షిప్త వార్తలు(12)
నేడు, రేపు వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ స్వల్ప వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత కొంత తగ్గిందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా మధిర(ఖమ్మం జిల్లా)లో 2, వడ్డెనపల్లి(సూర్యాపేట)లో ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. బుధవారం పగలు కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. గురు, శుక్రవారాల్లో సైతం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి తెలిపారు.
‘భాషా పండితుల ఉన్నతీకరణకు మంత్రి హామీ’
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే భాషా పండితుల పోస్టులను గ్రేడ్ 2 హోదా నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్నతీకరించి న్యాయం చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. జీఓలు, సవరణ జీఓలు ఇచ్చినా తమ సమస్య కొలిక్కి రావడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి నర్సింలు బుధవారం మంత్రిని కలిసి విన్నవించారు.
తొమ్మిదేళ్లుగా బదిలీలు లేవు: ఉద్యోగంలో చేరిన 2013 జూన్ నుంచి తొమ్మిదేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకుండా ఒకే చోట పనిచేస్తున్నామని, అందుకే వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు విద్యాశాఖ మంత్రి సబితను కోరారు.
‘ఉపాధ్యాయ నియోజకవర్గం’ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గంలో 23,816 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్థానానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ జాబితా రూపొందించారు.
అభిషేక్, నాయక్‌ల బెయిల్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో వ్యాపారవేత్తలు విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌లకు ట్రయల్ కోర్టు ఈ నెల 14న బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ యోగేశ్ ఖన్నా ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. నాయర్, అభిషేక్‌లపై మోపిన నేరాలు నిరూపితమైతే విధించే గరిష్ఠ శిక్షాకాలం ఏడేళ్లు మాత్రమేనని, అందువల్ల వారికి బెయిల్ ఉపశమనాన్ని నిరాకరించలేమని ట్రయల్ కోర్టు పేర్కొంది.
‘తొలిమెట్టు’పై టాస్క్‌ఫోర్స్
ఈనాడు, హైదరాబాద్: తొలిమెట్టు కార్యక్రమం అమలు నేపథ్యంలో 1-5 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పురోగతిపై ప్రతి నెల సమీక్షించి తగిన సూచనలు ఇచ్చేందుకు ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున జిల్లా అకడమిక్ టాస్క్‌ఫోర్స్(డీఏటీఎఫ్)లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఏడుగురు సభ్యులు ఉంటారు. డీఈఓ, డైట్ కళాశాల ప్రిన్సిపాల్/ అధ్యాపకుడు, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్, ఒక ఎంఈఓ, మండల స్థాయి రీసోర్స్ పర్సన్, క్లస్టర్ రీసోర్స్ పర్సన్, విద్యపై పనిచేసే స్వచ్ఛంద సంస్థకి చెందిన ఒక ప్రతినిధి ఉంటారు.
డిసెంబరు 3న ఆర్ఎంసీ సమావేశం
ఈనాడు హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలోని రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం డిసెంబరు 3న జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు బోర్డు బుధవారం సమాచారం ఇచ్చింది.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
మొయినాబాద్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 4న జీఈఎస్‌టీ-2023 పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ పరీక్ష రాయడానికి అర్హులన్నారు. మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యేవరకు ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.ntrtrust.orgలో ఈ నెల 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ డీన్ ఎంవీ రామారావు తెలిపారు. 7660002627/28 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఈ మొక్కల లెవలే వేరు!
రెండు, మూడడుగులు మాత్రమే పెరగాల్సిన మొక్కలు అంతకు రెండు మూడు రెట్లు పెరిగితే ఆశ్చర్యమే కదా! ఈ మొక్కలు కూడా అలాంటివే. అసాధారణంగా కనిపిస్తున్న వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొన్నిసార్లు తగిన సారవంతమైన నేల, ఆరోగ్యవంతమైన విత్తనం, జన్యు లక్షణం వల్ల ఇలా మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు.
మిన్నగా ఎదిగిన జొన్న
వరంగల్ రాంకీ కాలనీలో న్యాయవాది నీరజ మధుకుమార్ ఇంట్లో 15 అడుగుల మేర పెరిగిన జొన్న మొక్క ఇలా భవనంతో పోటీపడుతోంది. మామూలుగా అయితే ఈ మొక్కలు ఆరేడు అడుగుల వరకే పెరుగుతాయి.
-న్యూస్‌టుడే, కాశీబుగ్గ
ఎనిమిది అడుగుల వంగ!
ఇది నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగిలో రైతు నర్సింహ పెరట్లో ఎనిమిది అడుగుల మేరకు పెరిగిన వంగ మొక్క. సాధారణంగా ఈ మొక్క రెండు, మూడడుగుల ఎత్తే పెరుగుతుంది.
-న్యూస్‌టుడే, గుర్రంపోడు
ఇన్‌సర్వీస్ వైద్యులకు పీజీలో మరో విడత ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: పీజీ వైద్యవిద్య ఇన్‌సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లకు మరో విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహించాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రజారోగ్య విభాగంలో ప్రత్యేక బదిలీలకు ప్రభుత్వం అనుమతించినందుకు తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ నేతృత్వంలో బృందం బుధవారం మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఇన్‌సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లకు మాప్‌అప్ రౌండ్ నిర్వహించాలని సంఘం ప్రతినిధులు కోరగా.. మంత్రి స్పందించి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
డిసెంబరుకల్లా మీడియా అకాడమీ కొత్త భవనం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ కొత్త భవన నిర్మాణాన్ని డిసెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో మీడియా అకాడమీ భవన నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు.
వృక్ష ప్రేమిక అధికారి హత్య దురదృష్టకరం: ఎంపీ సంతోష్
ఈనాడు, హైదరాబాద్: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యపై ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వృక్షాలను ప్రేమిస్తూ వాటిని కాపాడుతున్న అధికారి హత్యకు గురికావడం అత్యంత దురదృష్టకరం’ అని ట్వీట్ చేశారు. ఎఫ్ఆర్వో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘కాళోజీ’ రిజిస్ట్రార్ పదవికి పోటాపోటీ
ఈనాడు, వరంగల్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రస్తుత రిజిస్ట్రార్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్ పదవీ కాలం పూర్తి కావడంతో త్వరలో కొత్త రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఈ పదవికి పలువురు వైద్యులు, వైద్యేతర అధికారులు పోటీపడుతున్నారు. కేఎంసీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుంకరనేని సంధ్య, ప్రస్తుత కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ గోపాలరావులలో ఒకరికి ఈ పదవి దక్కనుందని సమాచారం. మరికొందరు సైతం దరఖాస్తు చేసుకోవడంతో పోటీ నెలకొంది. కొత్త రిజిస్ట్రార్ నియామకం జరిగే వరకు ప్రవీణ్‌కుమారే ఈ పదవిలో కొనసాగి తర్వాత మళ్లీ కేఎంసీలో ప్రొఫెసర్‌గా చేరనున్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు