64 మంది సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల నియామకాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 64 మంది సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు అందుబాటులోకి వచ్చారు. వేర్వేరు విభాగాలకు చెందిన సూపర్‌ స్పెషలిస్టు వైద్యులను నియమిస్తూ వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏడాది తప్పనిసరి సేవల కింద వీరందరూ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. నియమితులైన వైద్యులందరూ ఈనెల 30లోగా కేటాయించిన వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో చేరాలని డీఎంఈ ఆదేశించారు. ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో వైద్యులు నివసించాలని, ముందస్తు రాతపూర్వక అనుమతులు లేకుండా వరుసగా ఏడు రోజుల కంటే ఎక్కువగా గైర్హాజరైతే, సదరు వైద్యుడిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. తప్పనిసరి సేవల నిబంధనల ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రూ.50 లక్షలను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని రమేశ్‌రెడ్డి ఆదేశాల్లో స్పష్టం చేశారు. తప్పనిసరి సేవల్లో నియమితులైన ఒక్కో వైద్యుడికి 20 సాధారణ సెలవులు, గరిష్ఠంగా నెలకు 2 చొప్పున వాడుకోవచ్చని వివరించారు. బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, వీరికి నెలకు రూ.1.25 లక్షలు గౌరవ వేతనంగా చెల్లిస్తామని తెలిపారు.

ప్లాస్టిక్‌ సర్జరీలో 11 మంది: తప్పనిసరి సేవల్లో నియమితులైన వారిలో ప్లాస్టిక్‌ సర్జరీలో 11 మంది, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరో సర్జరీలలో ఏడుగురు చొప్పున, నెఫ్రాలజీ, జెనిటిక్‌ యూరినరీ సర్జరీలలో ఆరుగురు చొప్పున, న్యూరాలజీలో అయిదుగురు, ఎండోక్రైనాలజీ, పీ‡డియాట్రిక్‌ సర్జరీలలో నలుగురు చొప్పున, సర్జికల్‌ ఆంకాలజీలో ముగ్గురు, నియోనటాలజీలో ఇద్దరు, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిని ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, రిమ్స్‌ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఆసుపత్రుల్లో నియమించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు