గల్ఫ్‌ బాధితులకు సహకరిస్తున్నాం

సుప్రీంకోర్టులో తెలంగాణ అధికారి అఫిడవిట్‌  

ఈనాడు, దిల్లీ: ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి విభిన్న కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయిన బాధితులకు భారత దౌత్యకార్యాలయాలు న్యాయపరమైన సహాయం అందిస్తున్నట్లు తెలంగాణ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని సుప్రీంకోర్టుకు విన్నవించారు. విదేశీ/గల్ఫ్‌ దేశాల జైళ్లలో మగ్గుతున్న 8,189 మంది, మరణశిక్ష ఎదుర్కొంటున్న 44 మంది భారత పౌరులకు నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసేవలు అందించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ పి.బసంత్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాణి కుముదిని అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు అక్కడి భారత దౌత్యకార్యాలయాలు ప్రాథమిక న్యాయ సహాయం అందిస్తున్నాయి.  ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఆసరాగా నిలుస్తూ, అవసరార్థులకు అనువాదకులను సమకూరుస్తూ, కోర్టు కేసుల్లో పోరాడేందుకు సాయం చేస్తున్నాయి. విదేశాల్లో చనిపోయిన వారి భౌతిక కాయాలను స్వదేశానికి రప్పించడానికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విదేశాల్లో వివాహ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఆర్థిక, న్యాయపరమైన సహాయం అందించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వద్ద పథకం ఉంది. ఇమిగ్రేషన్‌, గల్ఫ్‌దేశాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పి పంపే ఏజెన్సీలు, ఏజెంట్లు, మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అనధీకృత ఏజెంట్ల మోసాలపై చర్యలను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. గల్ఫ్‌ మోసాల గురించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి తెలంగాణ ప్రభుత్వ పరంగా జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేసి విదేశాలకు వెళ్లే గృహనిర్మాణ కార్మికులు, ఇతరులు, సహాయకులపై దృష్టిసారిస్తోంది. ప్రవాస భారతీయుల ప్రయోజనాల పరిరక్షణకు ఈ సంస్థ మొబైల్‌ యాప్‌ రూపొందించి ఫిర్యాదులు నమోదుచేసే వెసులుబాటు కల్పించింది’’ అని రాణి కుముదిని సుప్రీంకోర్టుకు విన్నవించారు.


మరిన్ని