అధిక ఫీజులపై 24 ఇంజినీరింగ్‌ కళాశాలలకు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 24 ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్‌ ఫీజులను మించి.. అధికంగా వసూలు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదులపై  సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కన్వీనర్‌ కోటా సీట్లకు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా కన్వీనరే వసూలు చేస్తారు. అందులో అధికంగా వసూలు చేసే అవకాశం లేదు. కళాశాలలు ప్రత్యేక ఫీజు రూపేణా ఒక్కో విద్యార్థి నుంచి రూ.5,500 వసూలు చేయాలి. ఆ పేరిట అధిక శాతం కళాశాలలు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు గుంజుతున్నాయి. వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందటంతో కమిటీ నోటీసులు జారీచేసింది. దీనిపై కొన్ని కళాశాలలు వివరణ పంపాయి.  స్పందించని కళాశాలల  ప్రతినిధులను కార్యాలయానికి పిలిపించి విచారణ జరుపుతున్నారు. వాటి వివరణతో సంతృప్తి చెందని పక్షంలో.. రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.


మరిన్ని