డిసెంబరు 1 తర్వాత పోడు భూములకు పట్టాలు: మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అర్హులైన పోడు రైతులందరికీ డిసెంబరు ఒకటో తేదీ తర్వాత సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోందని గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మహబూబాబాద్‌లో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడారు. పోడు భూముల రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. చంద్రుగొండ ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావును కొందరు గొత్తికోయలు హత్య చేయడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు.

పోడు సమస్యను తక్షణమే పరిష్కరించాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: ఎఫ్‌ఆర్వో హత్య దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోడు సమస్యను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో గిరిజనులపై అటవీ సిబ్బంది దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. పలువురు గిరిజన రైతులు ఆత్మహత్యకు పాల్పడడంతో పాటు అధికారులపైనా దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అధికారులపై దాడులు సమర్థనీయం కాదు: కూనంనేని

ఎఫ్‌ఆర్వో హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులపై దాడులు సమర్థనీయం కాదన్నారు.

‘ఎఫ్‌ఆర్వో మరణానికి కేసీఆర్‌దే బాధ్యత’

ఎఫ్‌ఆర్వో మరణం అత్యంత దురదృష్టకరం, విచారకరమని ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ కన్వీనర్లు మిడియం బాబురావు, వేములపల్లి వెంకట్రామయ్య, అంజయ్య నాయక్‌, రమణాల లక్ష్మయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని