200 అధికరణలో సవరణలు చేయాలి

గవర్నర్లు నిర్ణీత వ్యవధిలో దస్త్రాలు పరిష్కరించేలా నిబంధనలుండాలి
జాతీయ న్యాయసంఘం ఛైర్మన్‌కు వినోద్‌కుమార్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులను నిర్ణీత గడువులోగా రాష్ట్రాల గవర్నర్లు ఆమోదించేలా నిబంధనలు కల్పిస్తూ రాజ్యాంగంలోని 200 అధికరణలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. ప్రస్తుతం రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల్లో గవర్నర్లు దస్త్రాలను వీలైనంత త్వరగా (యాజ్‌ సూన్‌ యాజ్‌ పాసిబుల్‌)పరిష్కరించాలి అనే వాక్యం ఉందని, దానిలో మార్పు చేసి 30 రోజుల్లోనే పరిష్కరించాలనే మాటను చేర్చాలన్నారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని జాతీయ న్యాయసంఘం (లాకమిషన్‌) ఛైర్మన్‌ రితురాజ్‌ అవస్థికి బుధవారం లేఖ రాశారు. గవర్నర్ల వైఖరి దేశవ్యాప్తంగా దారుణంగా ఉంటోందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలనాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,062 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన దస్త్రాన్ని కొన్ని నెలలుగా ఆమోదించకుండా గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలకు మాత్రమే గవర్నర్లు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని విమర్శించారు.

కక్ష పూరితంగా ఈడీ, ఐటీల దాడులు: తెరాస ఎమ్మెల్యే వివేకానంద

ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో అడ్డంగా దొరికిపోయిన భాజపా కక్ష పూరితంగా ఈడీ, ఐటీలతో తెరాస ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తోందని తెరాస ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. బుధవారం తెరాస శాసనసభా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలెదుర్కొంటున్న భాజపా నేత బీఎల్‌ సంతోష్‌ గురించి చెబుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడుల కోసం రోజూ రూ. 40 లక్షలు ఖర్చు పెడుతున్నారని వివేకానంద పేర్కొన్నారు


మరిన్ని