
బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు
హైకోర్టు తాజా ఆదేశాలు.. వెంటనే అమలు చేసిన సిట్
కుదిరితే 26.. లేదంటే 28న రావాలని పిలుపు
ఈనాడు, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 26 లేదా 28 తేదీల్లో ఎప్పుడైనా రావాలంటూ సూచించింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసుకు ఆయన స్పందించకపోవడంతో ఆయనకు మరోసారి నోటీసులు పంపాలని బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిట్ వెంటనే అమలు చేసింది. బుధవారం రాత్రి ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా సంతోష్‌కు తాజా నోటీసు పంపింది. పలు రాష్ట్రాల్లో 25 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అంశానికి సంబంధించిన సమాచారం సంతోష్‌కు రామచంద్రభారతి పంపించిన సందేశాల్లో ఉంది. దీనిపై సిట్ కూపీ లాగనుంది.
నిర్దేశిత గడువుతో నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు
అంతకుముందు బుధవారం మధ్యాహ్నం దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ భాజపాతో పాటు నిందితులు వేసిన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ విజయసేన్‌రెడ్డి విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, భాజపా పక్షాన మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. బీఎల్ సంతోష్‌కు నోటీసులిచ్చినా హాజరు కాలేదని.. దీనివల్ల దర్యాప్తు ఆలస్యమవుతోందని ఏజీ తెలిపారు. సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని మహేశ్ జెఠ్మలానీ చెప్పగా.. ఎప్పటివరకు సమయం కావాలని హైకోర్టు ఆయనను ప్రశ్నించింది. దర్యాప్తులో కీలకమైన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేయాలనే దురుద్దేశంతోనే సంతోష్ జాప్యం చేస్తున్నారని, అదనపు ఏజీ జె.రాంచందర్‌రావు వాదించారు. భాజపా తరఫున హాజరైన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ న్యాయవాది రాంచందర్‌రావు అదనపు ఏజీ వాదనలను తోసిపుచ్చారు. సంతోష్ చట్టాన్ని గౌరవించే పౌరుడని, ప్రస్తుతం తాను బిజీగా ఉన్నందున హాజరుకాలేనంటూ ఆయన సిట్‌కు లేఖ రాశారని తెలిపారు. సంతోష్‌ను అరెస్టు చేయొద్దని గత శనివారం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏజీ కోరగా నిరాకరించిన హైకోర్టు.. మరోసారి సంతోష్‌కు ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా నోటీసులివ్వాలని ఆదేశించింది. ఈ కేసులో పిటిషన్ వేసిన భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డికి... సంతోష్ సిట్ ఎదుట హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా అని హైకోర్టు సూచించింది.
కౌంటర్ దాఖలుకు ఆదేశం
ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని భాజపాతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. భాజపా తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్, నిందితుల తరఫున మహేష్ జెఠ్మలానీ వాదించారు. ఈ కేసును కేవలం రాజకీయ లబ్ధి కోసమే నమోదు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని మహేష్ జెఠ్మలానీ వాదించారు. దీనిపై 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.
నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ వేసిన పిటిషన్‌ను విచారించిన నాంపల్లిలోని ఏసీబీ కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. నిందితులను మరో అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ శనివారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జి.రాజగోపాల్ తీర్పును గురువారానికి వాయిదా వేశారు.
సిట్ అధికారులు వేధిస్తున్నారు
హైకోర్టుకు న్యాయవాది శ్రీనివాస్ మొర
సిట్ అధికారులు దర్యాప్తు పేరుతో తనను వేధిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సిట్ చెప్పడంతో.. ఇతర పనులేమీ చేసుకోలేకపోతున్నట్లు శ్రీనివాస్ తరఫు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కోర్టుకు తెలిపారు. అధికారులు దర్యాప్తుతో సంబంధం లేని విషయాలు అడుగుతున్నారని, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నిస్తుండటంతో శ్రీనివాస్ ఒత్తిడికి గురవుతున్నారని కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ నెల 25న సిట్ అధికారుల ఎదుట హాజరై వారు ఇదివరకే అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు