అటవీ వీరుడికి అంతిమ వీడ్కోలు

రక్షణ కల్పించాలంటూ మంత్రుల ఎదుట అటవీ సిబ్బంది ఆందోళన

ఈటీవీ, ఖమ్మం: గొత్తికోయల పాశవిక దాడిలో హతమైన చంద్రుగొండ ఎఫ్‌ఆర్వో చలమల శ్రీనివాసరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో అటవీ సిబ్బంది, కుటుంబసభ్యుల అశ్రునివాళుల మధ్య బుధవారం జరిగాయి.  ‘అటవీ వీరుడా.. అంతిమ వీడ్కోలు’ అంటూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సిబ్బంది బరువెక్కిన హృదయాలతో ఎఫ్‌ఆర్వోకు కడసారి వీడ్కోలు పలుకుతుండగా ఈర్లపూడి శోకసంద్రంగా మారింది.

పాడె మోసిన మంత్రులు

ఎఫ్‌ఆర్వో మృతదేహానికి మంగళవారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు జరిపిన అనంతరం ఈర్లపూడికి తరలించారు. ఆయనను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. శ్రీనివాసరావు మృతదేహానికి ప్రభుత్వం తరఫున అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాళి అర్పించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఖమ్మం, భద్రాద్రి జడ్పీ ఛైర్మన్లు కమల్‌ రాజు, కోరం కనకయ్య తదితరులు హాజరయ్యారు. బాధిత కుటుంబానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.2 లక్షల నగదు అందజేశారు. సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌, హరితహారం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ తదితరులు శ్రీనివాసరావు మృతదేహానికి నివాళి అర్పించారు. శ్రీనివాసరావు పాడెను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ మోశారు. అధికార లాంఛనాలతో ఎఫ్‌ఆర్వో వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి.

సిబ్బంది ఆందోళన

‘అడవుల సంరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. సిబ్బందిపై నిత్యం ఏదో ఒకచోట భౌతికదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకెన్ని దాడులు ఎదుర్కోవాలి. ఇంకెంతమంది చావులు చూడాలి’ అంటూ ఆ శాఖ సిబ్బంది.. మంత్రులు, ఉన్నతాధికారుల ఎదుట బోరుమన్నారు. ఎఫ్‌ఆర్వో అంత్యక్రియల సమయంలో అటవీ సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. దీంతో ఎఫ్‌ఆర్వో వ్యవసాయ క్షేత్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనివాసరావు ఇంటి వద్దకు మంత్రులు, కలెక్టర్లు, పోలీసు, అటవీ అధికారులు వచ్చిన సమయాల్లో సిబ్బంది నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోడు సర్వే బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇలాంటి చావులు తమకొద్దని రోదిస్తూ మంత్రులు, అధికారులను ఘెరావ్‌ చేసేందుకు యత్నించారు. వారిని పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ సముదాయించారు.

దాడులను ఉపేక్షించం: మంత్రులు

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం సర్వే జరుపుతున్న తరుణంలో రేంజర్‌ను హతమార్చడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌ అన్నారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇద్దరు పిల్లల చదువుకు అండగా నిలుస్తామన్నారు.

* శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్‌ తెలిపారు. ఎర్రబోడు గ్రామ శివారులోని సీతారామ కాల్వ కట్ట వద్ద మడకం తులా(45), పోడియం నంగా (37)లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


సమస్యాత్మక ప్రాంతాల్లో అటవీ స్టేషన్లు!

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌స్టేషన్ల తరహాలో అడవుల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో అటవీ స్టేషన్లు ఏర్పాటుచేయాలని ఆ శాఖ భావిస్తోంది. అటవీ భూముల్లో ఘర్షణలు జరిగితే ఉద్యోగుల రక్షణకు తక్షణమే సిబ్బంది వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అనుకుంటోంది. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో అటవీ సిబ్బందిపై దాడులు, నేరాల నియంత్రణ, అధికారుల భద్రతపై ఆ శాఖ దృష్టి పెట్టింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారుల మధ్య బుధవారం ఈ అంశం చర్చకు వచ్చింది. తమ రక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలని అధికారులు గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుధాల విషయంలో సాధ్యాసాధ్యాలపై మంత్రి, ఉన్నతాధికారుల మధ్య ప్రాథమికంగా చర్చ జరిగింది. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లోనే ప్రత్యేకంగా సమావేశం కావాలని మంత్రి  నిర్ణయించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ని కూడా కలిసి చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘ఈనాడు’ ఈ విషయాల్ని ప్రస్తావించగా.. పోలీస్‌స్టేషన్ల తరహాలో అటవీ ఉద్యోగుల భద్రత, అడవుల రక్షణకు స్టేషన్ల ఏర్పాటు ఆలోచన ఉందని, చర్చిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ధారించారు.మరిన్ని