నత్తనడకన యాసంగి సాగు!

రెండు నెలలవుతున్నా 9% విస్తీర్ణంలోనే పంటలు
వ్యవసాయశాఖ తాజా నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగి సీజన్‌ పంటల సాగు నత్తనడకన సాగుతోంది. గత నెల ఒకటిన సీజన్‌ ప్రారంభమైంది. దాదాపు రెండు నెలలవుతున్నా సాధారణ విస్తీర్ణం 47.85 లక్షల ఎకరాలకు గాను 4.32 లక్షల ఎకరాల్లోనే (9%) సాగయింది. గతేడాది ఇదే సమయానికి 7.07 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికిచ్చిన నివేదికలో వెల్లడించింది. ఈ సీజన్‌లో ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, సెనగ, వేరుసెనగల్లో ఏ ఒక్కటీ ఆశించినస్థాయిలో సాగు కాలేదు. మినుము, పెసర, జొన్న వంటి పంటలు సైతం నామమాత్రంగా సాగయ్యాయి. గత వానాకాలంలో జులై, ఆగస్టులో భారీవర్షాల కారణంగా పంటల సాగు ఆలస్యమైంది. వాటి కోతలు ఇంకా పూర్తికానందున యాసంగి పంటల సాగు ఆలస్యమవుతున్నట్లు వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. వరినాట్లు డిసెంబరు చివరికల్లా పూర్తిచేస్తేనే వచ్చే మార్చికల్లా కోతలు పూర్తయి నష్టాలు తగ్గుతాయని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ సూచిస్తోంది. ఇంకా వానాకాలం వరి కోతలు పూర్తికానందున వచ్చే జనవరి ఆఖరుదాకా నాట్లు వేసే అవకాశాలున్నాయని దీంతో వరిసాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఓ వ్యవసాయాధికారి చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని