కోళ్ల ఫారాల పరికరాల ప్రదర్శన ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: కోళ్ల పరిశ్రమకు సంబంధించిన ఆధునిక పరికరాల అంతర్జాతీయ ప్రదర్శన బుధవారం హైటెక్స్‌లో నిరాడంబరంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరుగుతుంది. కోళ్ల పెంపకానికి ఫారాల్లో వినియోగించే పలు రకాల పరికరాలు, సామగ్రి, మందులు, ఇతర వస్తువులతో ఈ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. వివిధ దేశాలకు చెందిన ప్రైవేటు కంపెనీలు తమ ఉత్పత్తులు, ఆధునిక కోళ్ల ఫారాల సామగ్రిని ప్రదర్శనకు పెట్టాయి. ‘భారత కోళ్ల పరిశ్రమల సామగ్రి, ఉత్పత్తుల సంఘం, తెలంగాణ కోళ్ల ఫారాల సమాఖ్య’ల  ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తరవాత దీనిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కోళ్ల ఫారాల రైతులు, వ్యాపారులు, పలు కంపెనీల ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కోళ్ల ఫారాల సమాఖ్య ప్రతినిధులు ఈ ప్రదర్శన వివరాలను తెలిపారు. కొవిడ్‌ కారణంగా కోళ్ల పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొందని అంతర్జాతీయ గుడ్డు కమిషన్‌ ఛైర్మన్‌ చిట్టూరి సురేష్‌నాయుడు చెప్పారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమకు వ్యవసాయహోదా కల్పించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వానికి విన్నవించారు.


మరిన్ని