ఆలయాల్లో అదనపు ప్రసాదాలు!

యాదాద్రిలో తిరుమల తరహా నిర్వహణ
దేవాదాయ శాఖ కమిషనర్‌ యోచన

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదాల తయారీ, విక్రయాలపై దేవాదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల పేరొందిన ఆలయాల నిర్వాహకులతో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఎక్కడ ఏ ప్రసాదాలకు ఆదరణ ఉంటుందో తెలుసుకునేందుకు కార్తిక మాసం ముగిశాక, ఆయా ఆలయాల్లో ప్రయోగాత్మక చర్యలు చేపట్టనున్నారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర, కొమురవెల్లి, ధర్మపురి క్షేత్రాల్లో అవసరమైన మేర ప్రస్తుతం విక్రయిస్తున్న ప్రసాదాలు కాకుండా అదనపు రకాల తయారీకి త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా దేవాదాయశాఖ ఆలయాల నిర్వాహకులు, సంబంధిత విభాగాల బాధ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పటయ్యాయి.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో విక్రయించే దేవుడి ప్రసాదాలతో పాటు మరిన్ని కొత్తగా భక్తులకు అందించేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్షేత్రస్థాయిని పెంచేందుకు తిరుమల తరహాలో ప్రసాదాలను అందుబాటులోకి తేవాలన్నది కమిషనర్‌ ఆలోచన. ప్రస్తుతం విక్రయిస్తున్న లడ్డూ, పులిహోర, వడలే కాకుండా పొంగలి, గారె వంటి ప్రసాదాలను భక్తులకు విక్రయించే యోచనలో ఉన్నారు.


మరిన్ని