పింఛనుదారులే ఇక్కడ పెన్షనిచ్చేది!

15 ఏళ్లుగా.. అనాథలకు అండగా..
దర్గాకాజీపేటలో విశ్రాంత ఉద్యోగుల చేయూత

కాజీపేట, న్యూస్‌టుడే: వారంతా ప్రభుత్వం నుంచి పింఛను అందుకుంటున్న విశ్రాంత ఉద్యోగులు.. తమ గ్రామంలోని నిరుపేదలకు ఎంతోకొంత అండగా నిలవాలన్న సంకల్పంతో ఓ సంఘంగా ఏర్పడి సాయం అందిస్తున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లా దర్గాకాజీపేటకు చెందిన పింఛనుదారులు అదే గ్రామంలో అనాథలు, ఎలాంటి ఆసరాలేని 42 మందికి ప్రతినెలా 100 రూపాయలు ఇస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చిన సందర్భంలో ఈ మొత్తంతో పాటు పప్పు, నూనెలు వంటి నిత్యావసరాలను కూడా అందజేస్తున్నారు. గత 15 ఏళ్లుగా నిరాటంకంగా దీన్ని కొనసాగిస్తున్నారు. దర్గాకాజీపేటలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి విరమణ పొందిన 8మంది 2005లో ప్రగతి విశ్రాంత ఉద్యోగుల సంఘంగా ఏర్పడ్డారు. అప్పటి అధ్యక్షుడు శిరుమల్ల ఖాజయ్య (విశ్రాంత డివిజనల్‌ అగ్నిమాపక అధికారి) పేదలకు సహాయం అందించాలనే తలంపుతో ‘దీనబంధు’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. సంఘంలోని విశ్రాంత ఉద్యోగులు ఒక్కొక్కరిని దత్తత తీసుకుని సాయం అందించడానికి నిర్ణయించారు. అనాథలు, నిరుపేదలు 8 మందిని ఎంపిక చేసి ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.100 చొప్పున పింఛను మాదిరిగా అందించడం (2008 నుంచి) ప్రారంభించారు. అప్పుట్లో ప్రభుత్వం అందించే సంక్షేమ పింఛను నెలకు దాదాపు రూ.200 ఉండేదని నిర్వాహకులు తెలిపారు. క్రమంగా నిరుపేదల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 42 మందికి ప్రతినెలా 10వ తేదీన ఈ మొత్తాన్ని ఇస్తున్నారు. అనారోగ్యంతో మంచంపట్టిన వారికి ఇంటివద్దకే వెళ్లి పింఛను, నిత్యావసరాలు అందిస్తున్నారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి మందులు సేకరించి అవసరమైనవారికి అందిస్తుంటారు. ప్రస్తుతం 50 మంది విశ్రాంత ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కరోనా సమయంలోనూ వీరు నిరుపేదలకు ఈ మొత్తాన్ని అందిస్తూ వచ్చారు. ‘‘రూ.100కు ఏమొస్తుందని కొందరు అనుకోవచ్చు.. మాకు చేతనైన సాయం చేయాలన్నదే లక్ష్యం. ఈ మొత్తాన్ని పెంచాలనే ఆలోచన ఉన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటంతో సాధ్యం కావడం లేదు’’ అని విశ్రాంత ఉద్యోగులు తెలిపారు. కాగా తమకు మాత్రలు, కూరగాయలు వంటివి కొనుగోలుకు రూ.100 ఉపయోగపడుతున్నాయని నిరుపేదలైన లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు.


మరిన్ని