రెండొందల రోబోలు చేయించా!

విదేశాల్లో పిల్లలు రోబోటిక్‌ పరిజ్ఞానంలో మనకంటే 20 ఏళ్లు ముందున్నారు. ఆ అవకాశం మన పిల్లలకీ అందించాలనే లక్ష్యంతో అడుగువేశారు హైదరాబాద్‌కి చెందిన ప్రసూన దేవలపల్లి. ఇంతవరకూ 20 వేల మంది పిల్లలకు శిక్షణ అందించిన ఆమె తన గురించి వసుంధరతో పంచుకున్నారు...

ప్రసూన వాళ్లది వరంగల్‌ జిల్లా హనుమకొండ. కాకతీయ విశ్వ విద్యాలయంలో మైక్రోబయాలజీ చేశారు. వివాహం తర్వాత భర్త రవికుమార్‌ ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. నాలుగేళ్లపాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలోనే అక్కడి పాఠశాలల్లో కొన్నిరోజులు వలంటీర్‌గా పని చేశారు. అప్పుడే ఆమెకు ఓ విషయం స్పష్టంగా అర్థమైంది. అది.. భవిష్యత్తంతా కృత్రిమమేధ, రోబోటిక్‌ పరిజ్ఞానాలదే అని. అక్కడి పిల్లలు రోబో విద్యలో 20 ఏళ్లు ముందుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పటికైనా అలాంటి పరిజ్ఞానాన్ని మనదేశ పిల్లలకీ అందించాలనుకున్నారు. స్వదేశంపై మమకారంతో 2011లో భర్త, పిల్లలతో నగరానికి తిరిగి వచ్చి మియాపూర్‌లో స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చేటప్పుడు అమెరికా నుంచి ఒక రోబోను తెచ్చుకున్నారు ప్రసూన. దాని మాన్యువల్‌ను ఆధారంగా చేసుకుని, అంతర్జాల సాయంతో సొంతంగా రోబో తయారీ సాధన చేశారు. ఏడాది పాటు ఇలా నేర్చుకున్నారు. తర్వాత తన ఇద్దరు పిల్లలు ఆర్నవ్‌, సుహాస్‌లకు తనే రోబో విద్యలో శిక్షణ ఇచ్చారు. ఆ అనుభవంతో మిగతా పిల్లలకూ శిక్షణ ఇచ్చేందుకు 2016లో ‘టిక్స్‌ రోబోటిక్స్‌’ అనే పరిశ్రను స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం రోబోలను తయారు చేయడమే కాకుండా.. పిల్లలకు రోబోల తయారీ, పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం. అలా ఈ అయిదేళ్లలో 20 వేల మంది పిల్లలకు శిక్షణ ఇచ్చారు. వీళ్లలో పేద, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే చిన్నారులు కూడా ఉండటం విశేషం. మియాపూర్‌ చుట్టుపక్కల ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా ఈ రోబో విద్యను అందిస్తున్నారు ప్రసూన. ఒక బడిలో పిల్లలు కొంతమంది రోబోల తయారీలో శిక్షణ పొందితే అది అక్కడి మిగిలిన పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తుందన్నది తన ఆలోచన. ప్రసూన కృషిని గుర్తించిన యునెస్కో ఆమెతో ప్రత్యేకంగా రెండు రోబోలను చేయించింది. ఒకటి... మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివరించేది, రెండోది... కొవిడ్‌ సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు. ఇవి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని...

‘మేం శిక్షణ ఇచ్చిన పిల్లలు గడిచిన నాలుగేళ్లలో... 32 జాతీయ, అంతర్జాతీయ స్థాయి రోబో పోటీల్లో సత్తా చాటారు. వీళ్లతో పోటీ పడటానికి వచ్చిన వాళ్లంతా దిల్లీ, బెంగళూరు, అమెరికా, యూకే వంటి చోట్ల శిక్షణ తీసుకున్న వాళ్లే. వాళ్లతో పోటీపడి గెలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పటికే ఐదుసార్లు అంతర్జాతీయ వేదికలపై మొదటి బహుమతులు అందుకున్నారు. నాలుగు సార్లు జాతీయ వేదికలపై మా పిల్లలు ట్రోఫీలు అందుకున్నారు. ఇలా బహుమతులు అందుకున్న వారిలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కూడా ఉన్నారు. మూడేళ్ల క్రితం హైటెక్‌సిటీలో జరిగిన రోబో పోటీల్లో వందల మంది కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను వెనక్కి నెట్టి మియాపూర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్తీక్‌, అమరేశ్వర్‌, శశాంక్‌లు మొదటి స్థానంలో నిలిచారు’ అని సంతోషంగా చెప్పుకొచ్చారు ప్రసూన. సరైన శిక్షణ ఉంటే మన పిల్లలు కూడా అద్భుతాలను చేయగలరన్నది తన నమ్మకం. దానికి రుజువుగా తన శిష్యుల విజయాలను ఉటంకిస్తారు ఆవిడ. ఈ పోటీల కోసం ప్రసూన ఇప్పటి వరకూ 200 పైచిలుకు రోబోలను పిల్లలతో తయారు చేయించారు. ప్రస్తుతం పిల్లలకు విద్యను అందించే రోబోలను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నానని ఈ ఏడాది చివరికల్లా దానిని పూర్తి చేస్తామంటున్నారు ప్రసూన. ఇవి అందుబాటులోకి వస్తే పిల్లలకు విద్యాబోధన మరింత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా ఉంటుందన్నది ఆవిడ నమ్మకం.

- పిన్నెబోయిన అక్కేశ్వరరావు, కూకట్‌పల్లి


మనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. అందుకు మాయలూ మర్మాలూ చేతకానవసరం లేదు. మనం గొప్పగా ఊహించగలం. మెరుగైన ఆలోచనలు చేయగలం. అనుకున్నది సాధించగలం. ఈ శక్తులన్నీ మనలో అంతర్లీనంగా ఉన్నవే. వాటిని వెలికి తీయడమే మనం చేయాల్సింది.

- జె.కె.రౌలింగ్‌, ప్రఖ్యాత రచయిత్రి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని