కొత్త కథలతో ఏలుతున్నారు

ఇంతవరకూ కథలు ఒక లెక్క... మగవాళ్ల చుట్టే తిరిగేవి. కానీ ఇప్పుడు మారాయి. ‘ఇంట్లో జరిగే హింస, పైకి మంచిగా ఉండే మగవాళ్లు ఇంట్లో చేసే వికృత చేష్టలు,  మెనోపాజ్‌, కార్పొరేట్‌ ప్రపంచంలో అణిచివేత’... వంటివే నేటితరం కథలు. వీటిలో మహిళలే హీరోలు. నయా కథలతో స్త్రీల సమస్యలని... స్త్రీల కోణంలో నుంచి ఓటీటీ వేదికపై ఆవిష్కరిస్తూ దేశదేశాల వీక్షకుల్ని అలరిస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలుల గురించి తెలుసుకుందాం రండి...

ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం కోసం ఆమె ఫొటోలని పంపినప్పుడు ‘నువ్వు పనికి రావు’ అన్నారు. ఆ వైఫల్యానికి ఆవేేు కాదు... ఆమె అభిమానులు కూడా సంతోషిస్తున్నారిప్పుడు. కారణం... ‘ఆ ఉద్యోగానికి వెళ్లి ఉంటే ‘దిల్లీక్రైమ్‌, హ్యూమన్‌’ లాంటి వెబ్‌సిరీస్‌లని మిస్‌ అయ్యే వాళ్లం. మహా అయితే విమానంలో ఎగిరే దానివి, ఇప్పుడు నటిగా అంతకంటే ఎక్కువ ఎత్తుకే ఎదిగావ్‌’ అంటున్నారు నటి షెఫాలీషా అభిమానులు. షెఫాలీ సొంతూరు మంగళూరు. ముంబయిలో పుట్టిపెరిగింది. భరతనాట్య కళాకారిణి. ఊర్మిళ, సత్య సినిమాలతో పరిచయం అయినా... శక్తిమంతమైన స్త్రీ పాత్రలే షెఫాలీకి ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చాయి. నిర్భయ ఘటనపై తీసిన ‘దిల్లీక్రైమ్‌’ వెబ్‌ సిరీస్‌లో డీసీపీ వర్తికా చతుర్వేదిగా నటించి అంతర్జాతీయంగా ఎమ్మా అవార్డుని అందుకుంది. ఒక మహిళా పోలీస్‌ అధికారిగా ఆమె ఎదుర్కొన్న ఒత్తిడి, అమ్మగా ఆమె పడే వేదనని నటనలో చూపించి లక్షలకొద్దీ అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన హ్యూమన్‌లో విశ్వరూపం ప్రదర్శించి మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం విద్యాబాలన్‌తో కలిసి నటించిన ‘జెల్సా’ విడుదలవుతోంది. మహిళల హక్కులని గుర్తుచేస్తూ... ‘హ్యాపీ బర్త్‌డే మమ్మీజీ’ పేరుతో ఆమె దర్శకత్వం వహించిన లఘుచిత్రం ఒక్కవారంలోనే ఏడున్నర లక్షల వ్యూస్‌ని అందుకుంది. షెఫాలి మంచి చిత్రకారిణి కూడా. ‘నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్లకు పార్ట్‌టైం అమ్మగా ఉండటం నాకిష్టం లేదు. అందుకే సినిమాల తర్వాత విరామం తీసుకున్నా. మన మెడ మీద కత్తిపెట్టి అమ్మగా ఉండు, ఇంటి బాధ్యతలు చూడు అని ఎవరూ అనరు. ఆ పనులు చేయాలని మనకి మనమే కండిషన్‌ అవుతాం. బాధ్యతలు తీసుకుంటాం. కానీ ఆ బాధ్యతల్లో మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి’ అంటుంది 49 ఏళ్ల షెఫాలి.


కష్టాలే వన్నె తెస్తాయి: క్రితి కుల్హారీ

‘నువ్వు నోరు తెరవకపోతే ఇంట్లో నీపై జరిగే అసహజ శృంగారం గురించి ప్రపంచానికెలా తెలుస్తుంది? నీకు రక్షణ ఇచ్చేవాళ్లెవరు?’.... ‘క్రిమినల్‌ జస్టిస్‌: బిహైండ్‌ క్లోజ్డ్‌ డోర్స్‌’ సారాంశమదే. ఎన్నో ఇళ్లలో ఆడవాళ్లపై జరిగే ఈ హింసని తన నటనతో ప్రపంచానికి అర్థవంతంగా చెప్పింది క్రితికుల్హారీ. పింక్‌, మిషన్‌ మంగళ్‌యాన్‌, ఉరి, ఇందుసర్కార్‌, హ్యూమన్‌, గర్ల్‌ ఇన్‌ ద ట్రైయిన్‌.. ఇలా అన్నింట్లోనూ తనవి రాజీపడని, శక్తిమంతమైన స్త్రీ పాత్రలే. ఇప్పుడు క్రితి ‘నాయికా’ చిత్రాన్ని నిర్మిస్తోంది. సొంతూరు రాజస్థాన్‌, పుట్టి పెరిగిందంతా ముంబయి. తండ్రి నౌకాదళ కమాండర్‌. ‘జపాన్‌లో విరిగిన పాత్రలని పడేయరు. బంగారంతో కలిపి అతికిస్తారు. అంటే జీవితంలో వచ్చే కష్టాలే మనకి వన్నె తెస్తాయని అర్థం. దీన్నే వాళ్లు కింట్సూకురోయ్‌ అంటారు. నా నిర్మాణ సంస్థ పేరూ అదే. మొదట్లో నేవీలోకి వెళదామనుకున్నా. వీలుపడలేదు. నచ్చకపోయినా అందరిలో గొప్పగా ఉంటుందని డిగ్రీలో మ్యాథ్స్‌ తీసుకున్నా. చచ్చీచెడీ పాసయ్యా. కొన్ని ఇబ్బందులతో భాగస్వామికి దూరమయ్యా. అప్పుడే.. ఎవరి కోసమో కాదు మన కోసం మనం బతకాలని అర్థమైంది. వాటి ప్రభావమో ఏమో నేను ఎంచుకునే పాత్రలూ స్త్రీల శక్తిని చాటేవిగా ఉంటాయి’ అంటోంది క్రితి. ఓ పాప కూడా ఉన్న 37 ఏళ్ల క్రితికి ఇప్పుడు హాలీవుడ్‌ అవకాశాలూ తలుపు తడుతున్నాయి.


పాడ్‌కాస్టర్‌ నటి!: రసికా దుగల్‌

తొలి సినిమాలోనే వితంతువు పాత్ర. తనలోని నటనని వెలికితీసే అవకాశమనుకుంది. తర్వాత... మాంటో, అవుటాఫ్‌లవ్‌, లూట్‌కేస్‌, మీర్జాపూర్‌, దిల్లీక్రైమ్‌ అన్నీ వేటికవే సాటి. అవే 36 ఏళ్ల రసికా దుగల్‌కి దేశదేశాల్లో అభిమానులని సంపాదించి పెట్టాయి. దిల్లీక్రైమ్‌లో ట్రైనీ డీసీపీ, అవుటాఫ్‌లవ్‌లో చదువుకునీ, మంచి హోదాలో ఉండీ ఆర్థిక అక్షరాస్యత లేకపోతే స్త్రీల పరిస్థితి ఏమవుతుందో తెలిపే పాత్రల్లో అద్భుతంగా నటించింది. రచయిత సాదత్‌హసన్‌ మంటో జీవితం ఆధారంగా నందితాదాస్‌ తీసిన చిత్రంలో మంటో భార్య సఫియా పాత్రలో  అందరి ప్రశంసలు అందుకుంది. లూట్‌కేస్‌, మీర్జాపూర్‌ చిత్రాలకు ఉత్తమ నటిగా నామినేట్‌ అయ్యింది. హమిద్‌లో విధవరాలి పాత్రకు రాజస్థాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డునీ అందుకుంది. దిల్లీ లేడీశ్రీరామ్‌ కాలేజీలో సైన్స్‌లో డిగ్రీ చేసినా శ్రీదేవిపై ఇష్టంతో పుణెలో ఎఫ్‌టీఐఐలో పీజీ డిప్లొమా చేసింది. సొంతూరు ఝార్ఖండ్‌. ‘చిన్నప్పుడు ఛండీగఢ్‌లో మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. అక్కడెప్పుడూ కరెంట్‌ కోతే. చాలామంది పిల్లలం. బాగా అల్లరి చేసేవాళ్లం. గోల తట్టుకోలేక సినిమాలకు తీసుకెళ్లేది అమ్మమ్మ. అక్కడ ఏసీ కూడా ఉంటుంది కదా, బుద్ధిగా సినిమా చూసేదాన్ని. అలా సినిమాలకు దగ్గరయ్యా’ననే రసికా పాడ్‌కాస్టర్‌ కూడా. కొవిడ్‌పై అన్‌కొవిడబుల్‌ పేరుతో పాడ్‌కాస్టింగ్‌ కూడా చేసింది. రసికకి నమిత్‌, రమిత్‌ అనే కవలలతోపాటు గితిక్ష అనే పాప ఉంది.


మరిన్ని

ap-districts
ts-districts