
ఓ ప్రశ్న, సినిమా.. రూ.137 కోట్ల వ్యాపారం!
కెరియర్ ఎలా నిర్ణయించుకుంటాం? ఎన్నో సమాధానాలొచ్చాయా? నిధి యాదవ్‌ని అడిగి చూడండి. ఒక ప్రశ్న, ఒక సినిమా అని చెబుతుంది. చిత్రంగా ఉన్నా.. వీటి ఆధారంగానే వ్యాపారవేత్త అయ్యింది. కోట్ల వ్యాపారంగానూ తీర్చిదిద్దింది. ఆసక్తిగా ఉంది కదూ! అవేంటో.. ఆమె విజయ ప్రస్థానమెలా సాగిందో చదివేయండి.
‘అకస్మాత్తుగా ఉద్యోగం మానేయాలని ఎందుకనిపించింది?.. ఇంట్లో వాళ్లతో సహా ఎంతమంది నుంచి ఈ ప్రశ్ననెదుర్కొన్నానో! కారణం మళ్లీ ప్రశ్నే! అదే నా జీవితానికి ఓ సమాధానమిచ్చింది. ఓరోజు మా మెంటార్.. ‘చివరిసారి మీకెప్పుడు ఆఫీస్‌కు సంతోషంగా రావాలనిపించింది?’ అనడిగారు. నిజం చెప్పనా.. నా సమాధానం ‘ఎప్పుడూ లేదనే’. అదే మార్గం మార్చుకునేలా చేసింది’ అని నవ్వేస్తుంది నిధి. ఈమెది ఇండోర్. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసి, హైదరాబాద్ డెలాయిట్‌లో ఉద్యోగాన్ని సాధించింది. ఏడాదిన్నర చేసింది. ఆరోజు మెంటార్ ఈ ప్రశ్న అడిగేవరకూ తన అసంతృప్తి తనకూ తెలియదు. ‘ఇది నచ్చలేదు సరే! మరింకేం చేయాలో స్పష్టత లేదు. ఓరోజు ‘మెరిల్ స్ట్రీప్స్’ సినిమా చూస్తోంటే ఒక పాత్ర దుస్తులు బాగా నచ్చాయి. అంతే.. ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుని ఉద్యోగం మానేశా’ అని చెప్పుకొచ్చింది.
ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోయినా తన ఆసక్తిని కాదనలేదు. ముందు ఇటలీలో ఫ్యాషన్ బయింగ్ అండ్ మర్చండైజింగ్‌లో ఏడాది కోర్సు చేసింది. మంచి విద్యార్థి కదా, ఓ పెద్ద బ్రాండ్‌లో పనిచేసే అవకాశమొచ్చింది. కొన్ని నెలలు చేసి, భారత్‌కి తిరిగొచ్చింది. ఇక్కడా స్థానిక బ్రాండ్‌తో కొన్నాళ్లు పనిచేసింది. తర్వాత గుడ్‌గావ్‌కు చెందిన సప్తల్తో పెళ్లి, వెంటనే ఓ పాప. వ్యాపారం చేయాలన్న కోరికను భర్తతో చెప్పింది. ఆయనా ప్రోత్సహించాడు. ‘కానీ తొందరపాటు నా నైజం కాదు. వివిధ బ్రాండ్లు, వాటి పనితీరును పరిశీలించా. అంతర్జాతీయ బ్రాండ్ ‘జరా’ నన్ను ఆకర్షించింది. వాళ్లు ప్రతి 15-20 రోజులకు కొత్త మోడళ్లను ఉంచుతారు. తయారు చేసేదీ తక్కువ మొత్తంలోనే! మళ్లీ ఆ డిజైన్ చేయరు. దీంతో పెట్టినవి పెట్టినట్లు అమ్ముడవుతాయి. ఈ పద్ధతి నన్ను ఆకర్షించింది. పైగా దేశంలో ఎవరూ అనుసరించట్లేదు. అయితే నేను ఆధునిక వస్త్రాలు కాక సంప్రదాయ వస్త్రాలను ఎంచుకున్నా’ అంటుంది నిధి.
అలా 25 ఏళ్ల వయసులో 2014లో రూ.3.5 లక్షలతో అక్స్ (హిందీలో ప్రతిబింబమని అర్థం)ని గుడ్గావ్లో ప్రారంభించింది. ఇంట్లో నుంచే నిర్వహించేది. జయపుర నుంచి వస్త్రాన్ని తీసుకొచ్చి డిజైన్ చేసి, టైలర్లతో కుట్టించేది. వాటిని ఈకామర్స్ సైట్లలో అమ్మేది. వ్యాపారం, ఇంట్లోపని, పాప ఆలనాపాలనా అన్నీ ఒక్కతే చూసుకునేది. ఏడాది తర్వాతగానీ సహాయకులను నియమించుకోలేదు. ‘అప్పటికి ఆన్‌లైన్‌పై అంత అవగాహన లేదు. కానీ ఓపిగ్గా కొనసాగించా. నెమ్మదిగా ఆర్డర్లు పెరిగాయి. ఇల్లంతా ప్యాకింగ్, కుట్టిన వస్త్రాలతోనే నిండిపోయేది. దీంతో బేస్మెంట్ను అద్దెకు తీసుకున్నాం. మూడేళ్లలోనే ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చగలిగా. ట్రెండ్‌ను బట్టి డిజైన్లు మారుస్తూ వెళుతున్నా. దీంతో 2018 నాటికే రూ.100 కోట్ల వ్యాపారమైంది. సంస్థ పరిధీ పెరిగింది. నావద్ద దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. మావారూ ఉద్యోగం మానేసి నాతో చేయి కలిపారు. గుడ్‌గావ్, దిల్లీ, జయపుర, నాగాలాండ్‌ల్లో షోరూమ్‌లతోపాటు ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నాం. గుడ్గావ్లో 5 అంతస్థుల్లో సొంత కంపెనీ ఉంది’ అని చెబుతోంది నిధి. ఇప్పుడామె వ్యాపారం రూ.137 కోట్లకు పైనే! డిజైనింగ్, మార్కెటింగ్ ఆమె, ఆర్థిక వ్యవహారాలను భర్త చూసుకుంటున్నారు. తన బ్రాండ్ స్టోర్లను దేశవ్యాప్తం చేయడమే లక్ష్యమని చెబుతోంది. త్వరలోనే దాన్ని సాధించగలనంటోంది ఆత్మవిశ్వాసంతో!
ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే రాణించడం సులువు. దానికి తగ్గ సన్నద్ధత, పరిశోధనా మాత్రం అవసరం. ప్రతిరోజూ కుటుంబానికంటూ కొంత సమయం తప్పక కేటాయిస్తా. రెంటినీ సమన్వయం చేసుకున్నప్పుడే అసలైన విజయం.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs PAK: 2015 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్
-
World News
Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్