
ఆడపిల్లల... కలలకు రెక్కలు తొడుగుతాం!
ఆడపిల్లలైనంత మాత్రాన కలలకు కంచెలు వేసుకోవాలా? ‘మీరు ధైర్యంగా కలలు కనండి... వాటిని నిజం చేసే బాధ్యత మాది’ అంటున్నారు స్నేహ బోయళ్ల, విభూతి జైన్, రీనా హిందోచాలు. ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ వేదికగా ఎయిర్ హోస్టెస్, ఆర్కిటెక్ట్, ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో రాణించాలనుకునే అమ్మాయిలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందీ మిత్ర బృందం..
తండ్రి దూరమైతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆ ప్రభావం ముందుగా పడేది ఆడపిల్లలపైనే. పెద్దదిక్కు లేని ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేద్దాం అనుకుంటారు కానీ... వాళ్ల కలలకి రూపమిచ్చే ధైర్యం చాలా తక్కువ కుటుంబాలు చేస్తాయి. ఆ పనిని మేం భుజాలకెత్తుకున్నాం అంటారు ఈ సంస్థను ప్రారంభించిన విభూతి జైన్. 2014లో హైదరాబాద్‌లో ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ను ప్రారంభించడానికి ప్రధాన కారణం.. తనలా మరే ఆడపిల్లా చదువు కోసం ఇబ్బంది పడకూడదనే. ‘పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల ఎదుగుదలకు ఊతమివ్వడం, వాళ్ల చిన్నచిన్న ఆశలను తీర్చడం, ఉన్నత లక్ష్యాల వైపు వాళ్లని నడిపించడమే మా లక్ష్యం. అమ్మాయిలకు అద్భుతమైన తెలివితేటలున్నా.. వెన్నంటి ఉండేవారు లేనపుడు వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఆ బాధను స్వయంగా అనుభవించాను. మాది మధ్యప్రదేశ్‌లోని మాండ్లా. అమ్మ మాయ, నాన్న ఎస్కే జైన్. నాకు 13 ఏళ్లప్పుడు నాన్న దూరమయ్యారు. మధ్యతరగ¢తి కుటుంబం మాది. నా ఆశలన్నీ చెదిరిపోయాయి. ఆ సమయంలో అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో ఎంకామ్ చదివా. చాలాకష్టాల మధ్య నాగపూర్‌లో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పూర్తిచేసుకున్నా. ఉదయ్‌పూర్ తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పదోన్నతిపై నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణకు మేనేజర్‌గా బదిలీపై వచ్చా. ఇక్కడికొచ్చాక నాలా మరో అమ్మాయి ఇబ్బంది పడకూడదనే ఈ సంస్థను ప్రారంభించాను’ అంటారు విభూతి. మురికివాడల్లోని బాలికలకు యోగ, చిత్రలేఖనం, టైలరింగ్ వంటి అంశాల్లో శిక్షణనిచ్చేవారు. అంతటితో ఆగిపోకుండా ఆడపిల్లలని స్వశక్తితో ఎదిగేలా చేయాలని స్నేహ బోయళ్ల, రీనా హిందోచాలతో కలిసి ‘డ్రీమ్స్ ప్రాజెక్టు’కి శ్రీకారం చుట్టారు. ‘విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలనుకునే వారి కలని నిజం చేయాలనుకున్నా. ఇందుకోసం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే 50 మంది ఆడపిల్లలని ఎంపిక చేసుకుని హైదరాబాద్-బెంగళూరు విమానంలో ప్రయాణించేలా చేశా. వాళ్లలో ఒక అమ్మాయి.. నేను పైలెట్ అవుతానంది. ఆ లక్ష్యం నన్ను ఆలోచించేలా చేసింది. చదువుకోవాలనుకునే వారికి దాతల సాయంతో ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నా’ అనే విభూతి ఆలోచనకు, స్నేహ, రీనాల సహకారం తోడయ్యింది. వీరంతా కలిసి ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్, బ్యుటీషియన్, ఎయిర్‌హోస్టెస్.. ఇలా బాలికల అభిరుచికి తగినట్టుగా ఆయా అంశాల్లో డిప్లొమో, డిగ్రీ కోర్సుల్లో చేర్పించి అవకాశాలు కల్పిస్తున్నారు. ‘ఇతరులపై ఆధారపడకుండా.. కుటుంబాన్ని పోషించే ఆర్థిక స్వేచ్ఛ, మనోధైర్యం అందించడమే మా లక్ష్యం. ఇంతవరకూ 35 మంది యువతులు శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందారు. ఇందుకు కావాల్సిన మొత్తాన్ని దాతల సాయంతోనే సేకరిస్తున్నాం’ అని వివరించే స్నేహ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తూనే పేదింటి ఆడపిల్లల ఉన్నతికీ చేయూతనిస్తున్నారు. యోగా శిక్షకురాలైన రీనా ఈ సంస్థలో మరో కీలక భాగస్వామి. ‘దాతల సాయంతో వందల మంది పిల్లలకు యూనిఫామ్‌లను అందిస్తున్నాం. ‘డొనేట్ యువర్ టాలెంట్’ పేరుతో వివిధ రంగాల్లో నిపుణులను ఆహ్వానిస్తాం. చెఫ్‌లు, డ్యాన్సర్లు, ఆర్టిస్టులూ ఇలా ఎంతోమంది మా ఆహ్వానాన్ని అందుకుని వచ్చి పేద, మధ్య తరగతి ఆడపిల్లలకు నైపుణ్యాలు అందిస్తున్నారు. జీవితంలో ఎదగాలనే యువతులను గుర్తించి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ వారి కలలు నెరవేర్చుకునేందుకు దిశానిర్దేశం చేస్తున్నాయి’ అంటోంది రీనా. ప్రార్థించే పెదవుల కన్నా... సాయం చేసే చేతులే మిన్న అంటారు కదా. మేమదే చేస్తున్నాం అంటున్నారీ మిత్రులు.
- జి.సాంబశివరావు, హైదరాబాద్
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..