
అమ్మయ్యాకే మోడల్‌గా ఎదిగింది!
అమెరికాలో ఉద్యోగం, ప్రేమ వివాహం. ఆపైన ఓ పాప.. అనుకున్నవన్నీ సాధిస్తూ వచ్చిందామె. తల్లి అయ్యాక ‘జీవితమంటే ఇల్లు, ఉద్యోగం... ఇంతకు మించి ఏమీ ఉండదా’ అనే ప్రశ్న ఎదురైనపుడు... ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందని సమాధానమిచ్చుకుంది. ఇష్టమైన మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికల మీద మెరుస్తోంది తెలుగమ్మాయి చైతన్య పొలోజు. సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని వర్జీనియా నుంచి వసుంధరతో పంచుకుందిలా...
పెళ్లి తర్వాత కూడా ఏదో సాధించాలని చాలామందికి ఉంటుంది. కానీ చేయొచ్చా, సాధించగలమా... లాంటి సందేహాలెన్నో. ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా పెళ్లితో సంబంధం లేదని చెప్పేందుకు నేనే ఉదాహరణ. ఈ విషయంలో గర్వంగా అనిపిస్తుంది.
కాలేజీ రోజుల్లో చదువు, స్నేహితులూ, సరదాలు... ఇవి తప్ప పెద్ద లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. ఉద్యోగంలో చేరాక, పెళ్లి తర్వాత కూడా జాలీగా గడిపేసేదాన్ని. కానీ తల్లి అయ్యాక జీవితం గురించి లోతుగా ఆలోచించడం మొదలుపెట్టా. ఇల్లు, ఉద్యోగం... వీటికే పరిమితం కావడం నచ్చలేదు. ‘మోడలింగ్ వైపు వెళ్తే’ అన్న ఆలోచన వచ్చింది. అందుకో కారణం ఉంది. చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్లను అనుసరించడమంటే నాకిష్టం. అప్పుడూ మోడలింగ్ ఆలోచన వచ్చింది కానీ.. నాది గోధుమ రంగు చాయ, ఉంగరాల జుట్టు, ముక్కు కాస్త లావు... వీటి గురించి స్నేహితులే ఆటపట్టిస్తుంటే ఇక మోడలింగ్ చేసే ధైర్యం ఎక్కడొస్తుంది. ఇన్నాళ్లకు మళ్లీ ఆ కోరిక పుట్టింది. ఈ రంగంలో రాణించాలంటే నాజూకైన శరీరం, అవివాహిత కావడం.. లాంటివి ప్రధాన అర్హతలు. కానీ అవి తప్పనిసరి అని ఎక్కడా రాసి పెట్టి లేదుగా అనిపించింది. అందుకే మోడలింగ్ చేస్తానని మావారితో చెప్పా, తనూ అభ్యంతరం చెప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్లు మాత్రం ‘ఈ వయసులో ఎందుకు? ఉద్యోగం చేస్తూ, పాపని చూసుకుంటూ ఉండొచ్చుగా’ అన్నారు. బయట వాళ్ల నుంచీ కూడా ఇలాంటి మాటలే వినిపించాయి. మనకు స్పష్టమైన ఆలోచన ఉంటే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆగాల్సిన పని లేదనిపించింది. పాప పుట్టాక బాగా బరువు పెరిగాను. ముందు దాని మీద దృష్టి పెట్టి.. నాజూగ్గా మారడానికి ఏరియల్ యోగా, వెయిట్ లిఫ్టింగ్, హులా హూప్... వ్యాయామాలు చేసేదాన్ని. వీటి కోసం రోజూ కచ్చితంగా సమయం కేటాయించా. ఆహార నియంత్రణా పాటించి బరువును అనుకున్న స్థాయికి తెచ్చుకున్నా.
మొదటి అడుగిలా..
ముందుగా తానా, ఆటా వేడుకల్లో మోడలింగ్ చేయడం ప్రారంభించా. అక్కడ మనవాళ్లంతా నన్నెంతో ప్రోత్సహించారు. 2019లో న్యూయార్క్ అందాల పోటీల్లో ‘మిసెస్ భారత్’తోపాటు మరెన్నో విభాగాల్లో విజేతగా నిలిచా. ఆ వేదిక మీద నాకు కిరీటాన్ని అందించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షమితా శెట్టి మొదటి అవకాశం ఇచ్చారు. తర్వాత భారతీయ డిజైనర్ల వస్త్రాలు, బొటిక్‌లకు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. మరో డిజైనర్ అంజలీ ఫోగట్ ‘డిజైనర్ డ్రీమ్ కలెక్షన్స్’ మోడల్‌గా 2021-కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ మోడల్స్, హాలీవుడ్ ప్రముఖులతో ర్యాంప్ వాక్ చేశా. ఈ మధ్యే న్యూయార్క్ ఫ్యాషన్ షోలో డిజైనర్ దీప్తిరెడ్డి గౌన్ కలెక్షన్‌కు మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది.
నటిగానూ రాణిస్తూ...
2010లో అమెరికా వచ్చి.. ఐటీ ఉద్యోగం చేసే దాన్ని. తర్వాత ఎంబీఏ చేశాను. 2013లో సాయిరామ్ పల్లెతో వివాహం అయింది. మాది ప్రేమ వివాహం. 2018లో సాయి రామ్ హీరోగా నటించిన ‘కాక్టైల్ డైరీస్’ వెబ్ సిరీస్‌లో నేనూ నటించాను. మొదట పాపని చూసుకునేందుకు ఇద్దరిలో ఒకరు మాత్రమే నటించాలనుకున్నాం. అందరి తోడ్పాటుతో ఇద్దరమూ చేయగలిగాం. పాపకి అప్పుడు రెండేళ్లు. తననీ సెట్లోకి తీసుకెళ్లేవాళ్లం. ఆ తర్వాత ‘క్వారంటైన్ డైరీస్’లో నటించా. ప్రస్తుతం ఫ్రెడ్డీ మ్యాక్ కంపెనీలో సీనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నా. ఇంకా మోటివేషనల్ స్పీకర్‌గా, మోడలింగ్ శిక్షకురాలిగానూ పనిచేస్తున్నా. వీటివల్ల తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. కుటుంబాన్నీ చూసుకోవాలి. వంట, ఇంటిని శుభ్రం చేయడం... కొన్నిసార్లు భారంగా అనిపిస్తుంది. పాప, మావారూ నన్ను అర్థం చేసుకుని సాయం చేస్తుంటారు. అమ్మమ్మ వాళ్లది కర్నూలు. తాతయ్య, అమ్మమ్మ ఊళ్లో నలుగురికీ సాయపడటం చూసేదాన్ని. వారి స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకున్నా. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నా. సొంతంగా ‘కనెక్ట్హోప్’ ఎన్జీఓను ప్రారంభించా. దీనిద్వారా కొవిడ్ సమయంలో హైదరాబాద్‌లో వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరకులూ, లక్ష మందికి ఆహారం అందించాం.
- మల్లేపల్లి రమేష్‌రెడ్డి, హైదరాబాద్
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!