బాహుబలి అప్పాలు... తీర్చాయి అప్పులు!

సుజాతమ్మ, రమాదేవి, లక్ష్మి, సుభాషిణిలతోపాటు మరికొందరు పిండి వంటల తయారీలో బిజీగా ఉన్నారు. సమయం ఎక్కువ లేదు.. నాలుగురోజుల్లో పెళ్లి. ఆలోపే సారె కోసం లడ్డూలూ, సకినాలూ, అరిసెలూ... అన్నీ సిద్ధమైపోవాలి. అవికూడా భారీ సైజుల్లో ఉండాలి. అందుకే అర్ధరాత్రి దాటినా పొయ్యి వెలుగుతూనే ఉంది. ‘ఇంతకీ పెళ్లి ఎవరింట్లో’ అంటారా, హైదరాబాద్‌లోని ఓ బడా వ్యాపారి ఇంట్లో. ఆ పెళ్లికే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని చాలా పెళ్లిళ్లకు సుల్తాన్‌పూర్‌ నుంచే సారె వెళ్తుంది!

ఊళ్లో తయారయ్యే లడ్డూ కిలో పరిమాణంలో ఉంటే, గరిజ(కజ్జికాయ) ఒక్కోటి అర కిలో ఉంటుంది. సకినాలైతే ఏకంగా 32 వరుసల్లో పెద్ద చక్రాల్లా ఉంటాయి. ఈ బాహుబలి వంటకాలన్నీ శుభకార్యాల్లో సారెకోసం సిద్ధమవుతున్నవే. ఇవి తయారవుతున్నది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలం, సుల్తాన్‌పూర్‌లో. గ్రామానికి చెందిన సుభాషిణి, సుజాత, రమాదేవి ఖాళీ సమయంలో ఏదైనా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని 13 ఏళ్ల కిందట నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కాగితపు విస్తర్ల తయారీ గురించి ఆలోచించారు. కానీ దానికి పెట్టుబడి అవసరం. కొద్దిపాటి మొత్తం కూడా తమ దగ్గరలేదు. వారికొచ్చిన రెండో ఆలోచనే భారీ సైజు పిండి వంటల తయారీ. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపుడు వారి బంధువర్గంలో వీటిని చేయించేవారు. తర్వాత కాలంలో చాలామంది చేయించాలనుకున్నా, చేసేవాళ్లు లేక ఊరుకునేవారు. ఆ అనుభవం నుంచే వీరికి ఈ ఆలోచన వచ్చింది. ఒక్కో పిండి వంట తయారీలో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి 10 మంది మహిళలు సంఘంగా ఏర్పడ్డారు. ఊళ్లో, చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువర్గాల్లో తాము సారె కోసం పిండివంటలు తయారుచేస్తామని చెప్పారు. మొదట్లో చిన్న మొత్తంలోనే ఆర్డర్లు వచ్చేవి. అయినా వెనకడుగు వేయలేదు. అధైర్య పడలేదు. ఆర్డర్‌ ఏ స్థాయిలో వచ్చినా నాణ్యమైన నెయ్యి, బాదం, జీడిపప్పు, సన్నబియ్యం, వంట నూనె... మొదలైనవి వినియోగించడంతోపాటు రుచి, శుభ్రత విషయంలోనూ ప్రమాణాలు పాటించేవారు. ఆ సమయంలో వేములవాడకు చెందిన ఓ ధనిక కుటుంబం నుంచి పెళ్లి సారె కోసం భారీ ఆర్డర్‌ వచ్చింది. దాంతో వీరి దశ తిరిగింది. అక్కడ వాటి రూపం, రుచి చూసిన వాళ్లద్వారా ఇతర జిల్లాలకూ, రాష్ట్రాలకూ వీరి ఖ్యాతి చేరింది. లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలూ, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలూ, గవ్వలు.. ఇలా పలు రకాల పిండి వంటలు చేయడంలో వీళ్లు ప్రత్యేక గుర్తింపు సాధించారు. ‘ఏదైనా విందు, శుభ కార్యాలకు మేం సరఫరా చేసిన పిండి వంటకాలను రుచి చూసినవాళ్లే మమ్మల్ని సంప్రదిస్తారు. ఇలానే మా వ్యాపారం పెరుగుతూ వచ్చింది. పెళ్లి, సీమంతం ఇతర సందర్భాల్లో సారెగా పెట్టే పిండి వంటలతోపాటు దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండగలకూ ఆర్డర్లు వస్తుంటాయి. వీటిని మరీ ముందుగా కాకుండా కొద్దిరోజుల వ్యవధిలో తయారుచేస్తాం. అవసరమైతే తెల్లవార్లూ పనిచేస్తాం. దానివల్ల తాజాగా ఉంటాయి’ అని చెబుతారు అప్పాల తయారీ ఆలోచనను మొదట ప్రతిపాదించిన సుభాషిణి.

వ్యవసాయమూ మారింది!

పిండి వంటల్ని సాధారణంగా గ్యాస్‌ స్టవ్‌పైన చేస్తుంటారు, కొందరు మాత్రం ప్రత్యేక రుచి కోసం కట్టెల పొయ్యిమీద తయారుచేయమంటారు. అది కష్టంతో కూడిన పనే అయినా వారి కోరిక మేరకు అలానే చేస్తారిక్కడి మహిళలు. ఒక్క సంఘంతో మొదలైన ఈ బాహుబలి వంటకాల తయారీని ఇప్పుడు గ్రామంలో ఏడు మహిళా సంఘాలు చేస్తున్నాయి. ఒక్కో సంఘంలో 15-20 మంది సభ్యులుంటారు. కలిసి పనిచేస్తూ, సమానంగా లాభాల్ని పంచుకుంటారు. ఈ సంఘాలకు సహాయకులుగా పనిచేస్తూ గ్రామంలో మరో 200 మంది మహిళలూ ఉపాధి పొందుతున్నారు. వీరికి వచ్చే ఆర్డర్లు రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకూ ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో నెలకు ప్రతి సంఘానికి రూ.10లక్షలకు తగ్గకుండా ఆర్డర్లు వస్తాయి. ఇక్కడ తయారైన వంటకాలు అమెరికా, ఇంగ్లండ్‌లకూ పంపిస్తారు. రెండేళ్ల కిందట గవర్నర్‌ తమిళసై ఈ జిల్లాకు వచ్చినపుడు సుల్తాన్‌పూర్‌ వంటకాల్ని రుచి చూసి మహిళల్ని ఎంతో మెచ్చుకున్నారు. గ్రామంలో దాదాపు అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ఒకప్పుడు సాగు కోసం, పిల్లల పైచదువులకు, పెళ్లిళ్లకు అప్పులు చేయాల్సి వచ్చేది. మహిళల ఆర్థిక విజయంతో అప్పుల్లేకుండా వ్యవసాయం చేసి అక్కడా లాభాల్ని సంపాదిస్తున్నారు. చదువుల కోసం పిల్లల్ని ధైర్యంగా నగరాలూ, విదేశాలకు పంపిస్తున్నారు. పెళ్లిళ్లకు అప్పు చేయాల్సిన అవసరమూ లేదిప్పుడు. సుల్తాన్‌పూర్‌ ఇప్పుడు అప్పాల సుల్తాన్‌పూర్‌గా, అప్పుల్లేని గ్రామంగా మారిందంటే ఆ ఘనత మహిళలదేనంటున్నారు గ్రామస్థులంతా! 

- రాజమల్లు బానాల, పెద్దపల్లి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని