నా పాత్రని ద్వేషిస్తే నేను బాగా చేసినట్టు!

ఏకాస్త ఏమరపాటుగా ఉన్నా... ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూనే ‘కశ్మీర్‌ఫైల్స్‌’ చిత్రాన్ని నిర్మించారామె. అంతేనా... అందులో ఓ ముఖ్యపాత్రలోనూ నటించారు. పల్లవిజోషీ నాలుగేళ్ల కష్టానికి అందిన ఫలితమే ప్రధాని మోదీ సహా మరెందరో ప్రముఖుల ప్రశంసలు..

‘కశ్మీర్‌ ఫైల్స్‌’... 90ల నాటి కశ్మీర్‌ పరిస్థితులపై తీసిన చిత్రం ఇది. ‘మనమీ దేశంలో భాగం కాదు. అలాంటప్పుడు ‘అజాద్‌ కశ్మీర్‌’ కోసం పోరాడితే తప్పేంటి?’ అంటూ స్థానిక యువతని రెచ్చగొట్టే జేఎన్‌యూ ప్రొఫెసర్‌ రాధికమేనన్‌ పాత్రలో అద్భుతంగా నటించారు పల్లవీజోషి. దాంతో దేశవ్యాప్తంగా ఆమె నటనకి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె భర్త వివేక్‌ అగ్నిహోత్రీనే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇంతకీ పల్లవీ జోషీ ఎవరో గుర్తుపట్టారా?... మీరు 80, 90ల్లో దూరదర్శన్‌ చూసిన తరం అయితే ఆమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేణుకా సహానేతో కలిసి అంత్యాక్షరిని నిర్వహించిన పల్లవికి దేశవ్యాప్తంగా బోలెడు మంది అభిమానులు ఉన్నారు. ‘ఆరోహ్‌’, ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’ వంటి దేశభక్తి సీరియళ్లతోపాటు ఓ చోక్రీ, శ్యామ్‌ బెనగల్‌ నిర్మించిన ‘ది మేకింగ్‌ ఆఫ్‌ మహాత్మ’ వంటి సినిమాల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుక్ను నటి ఆమె. స్వస్థలం ముంబయి. వివేక్‌ అగ్నిహోత్రితో వివాహం అయ్యాక కొన్ని మరాఠా ధారావాహికలకు దర్శకత్వం వహించారు. కొన్నింటిని నిర్మించారు. ఇద్దరు పిల్లలు... మల్లిక, మానన్‌. కుటుంబం కోసం మధ్యలో బ్రేక్‌ తీసుకున్నా... ‘బుద్ధ ఇన్‌ ది ట్రాఫిక్‌ జామ్‌’ అనే చిత్రాన్ని నిర్మించి మళ్లీ సినిమాలకు చేరువయ్యారు. ఆ తర్వాత భర్తతో కలిసి నిర్మించిన ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’లో నటించి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్మించిన చిత్రమే ఈ కశ్మీర్‌ ఫైల్స్‌. ‘ఈ సినిమా చిత్రీకరణకు పట్టిన సమయం నెలరోజులే. కానీ ఆనాటి పరిస్థితులు గురించి పరిశోధించడానికి పట్టిన సమయం నాలుగేళ్లు. వందల మందిని ఇంటర్వ్యూలు చేశాం. ఎంతోమంది కశ్మీర్‌ పండితుల కన్నీటి గాథలు తెలుసుకున్నాం. చిత్రీకరణ సమయంలో ఎటు చూసినా నిఘా నేత్రాలుండేవి. ఎంతో భద్రత నడుమ ఈ సినిమాని చిత్రీకరించాల్సి వచ్చింది. ఆఖరికి నేను భయపడుతున్నట్టే చివరి రోజున ఆ షూటింగ్‌లో ఉన్నవారందరికీ ఫత్వా జారీ అయ్యింది. విషయం తెలిస్తే అందరూ ఆందోళన పడతారని వేగంగా పని పూర్తిచేసుకొని ఆ తర్వాత చెప్పాం. ఎలా అయితేనేం అక్కడ నుంచి బయటపడ్డాం. ఈ తంతంతా ఒక సవాలే అనిపించింది. మళ్లీ అక్కడకు తిరిగి వెళ్లడం సాధ్యం కాదని నాకు అర్థమవుతూనే ఉంది’.. అనే పల్లవి త్వరలో దిల్లీ ఫైల్స్‌ని నిర్మిస్తున్నారు. ‘నా కెరియర్‌లో చాలా పాత్రలు చేశాను. వాటిల్లో కొన్ని తప్ప చాలామటుకు నిస్సహాయ మహిళల పాత్రలే. అవి చేసీ చేసీ విసుగొచ్చింది. అందుకే ఇటువంటి పాత్రని ఎంచుకున్నా. దేశంలోని ప్రతి భారతీయుడూ నా పాత్రని ఎంతగా ద్వేషిస్తే నేనా పాత్రకి అంతగా న్యాయం చేసినట్టు లెక్క. శ్యాంబెనగల్‌, అమోల్‌పాలేకర్‌ వంటివారే నా చిత్రాలకు స్ఫూర్తి’ అంటోంది పల్లవీజోషి.


మరిన్ని

ap-districts
ts-districts