ఆసుపత్రి కోసం 450 కోట్లిచ్చారు!

సహృదయం ఉన్నవారి దగ్గర సంపద ఉంటే దానివల్ల సమాజానికే ఎక్కువ మేలు. అందుకు నిదర్శనం సుస్మిత-సుబ్రతో బాగ్చీ, రాధ- పార్థసారథి దంపతులే. బెంగళూరులోని ఐఐఎస్‌సీలో వైద్య కళాశాల స్థాపనకు ఇటీవల రూ.450 కోట్ల భూరి విరాళం అందించారు వీళ్లు. బాగ్చీ, పార్థసారథి ప్రముఖ ఐటీ సంస్థ ‘మైండ్‌ ట్రీ’ సహ వ్యవస్థాపకులు. వీరి వారసులంతా అమ్మాయిలే. అంతేకాదు, ఈ క్రతువును పూర్తి చేయడంలో కీలకపాత్ర సుస్మిత, రాధలదే. ఈ వితరణ వెనుక విశేషాల్ని వసుంధరతో పంచుకున్నారు వాళ్లు...

మా అమ్మానాన్నలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వారి ముందు తరాలూ ఆర్థికంగా ఇబ్బంది పడినవే. ఎవరికైనా సహాయం చేద్దామని ఉన్నా వాళ్ల దగ్గర డబ్బు ఉండేది కాదు. లేమిలోనూ మాకు మంచి చదువులు, విలువలు నేర్పించారు. అవకాశం వస్తే మేం సేవ చేయాలని చెప్పేవారు. పార్థసారథి, నేనూ కెరియర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాక... అంటే 12 ఏళ్ల క్రితమే, సమాజం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం. అమ్మానాన్నలు నేర్పిన విలువలే మా పిల్లలకూ నేర్పాం. ఇంత మొత్తంలో సాయం చేయాలన్న ప్రతిపాదనని మా అమ్మాయికీ అల్లుడికీ చెబితే వారూ సంతోషంగా మద్దతిచ్చారు. కొవిడ్‌తో మన వైద్య వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం తెలిసింది. అందుకే అటుగా ఆలోచించాం.

ఆశయం ఉన్నా సంపదలేదప్పుడు

- రాధ పార్థసారథి

ఐఐఎస్‌సీకే ఎందుకంటే?

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ఆవరణలోని ఎస్‌బీఐ శాఖలో చాలా ఏళ్లు పనిచేశా. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆ సంస్థ ప్రగతి ఎంతో గొప్పగా అనిపించేది. అప్పటికే సారథి, సుబ్రతోల మధ్య కంపెనీలో మా నలుగురి వాటాలను సమాజానికి ఉపయోగించడంపై చర్చలు జరుగుతుండేవి. నలుగురం కలిసి ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నపుడు ఐఐఎస్‌సీ గురించి చెప్పా. అప్పటికి ఆ సంస్థ తమ ప్రాంగణంలో వైద్యంలో పీజీ-పీహెచ్‌డీ స్థాయిలో విద్యను అందిస్తూ, పరిశోధనలూ జరిగేలా 800 పడకల ఆసుపత్రిని కట్టాలనుకుంటోంది. దీంట్లో ఇంజినీరింగ్‌, వైద్య నిపుణులు కలిసి పనిచేస్తారు. ఇక్కణ్నుంచి సైంటిస్టులైన డాక్టర్లూ వస్తారు. వారి పరిశోధనలు భారతీయుల జీవన ప్రమాణాల్లో మార్పు తెస్తాయని నమ్ముతున్నాం. ఈ విరాళం మా అమ్మానాన్నలకు ఇచ్చిన గురుదక్షిణగా భావిస్తున్నాం.

మార్పును మేం చూడాలన్నారు...
- సుస్మిత బాగ్చీ

హార్వర్డ్‌, యేల్‌, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి గొప్ప విద్యా సంస్థలూ, స్లోన్‌ కెటెరింగ్‌ (న్యూయార్క్‌లోని పురాతన, పెద్దదైన క్యాన్సర్‌ హాస్పిటల్‌) దాతలవల్లే సాధ్యమయ్యాయి. నాణ్యమైన విద్య, వైద్య సేవలు డబ్బుతో ముడిపడినవి. ఈ రంగాల్లో పేదలు, ధనికులకు అందే సేవల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ అంతరాన్ని తగ్గించాలని అనుకుంటున్నాం. ఈ విషయం మా ఇద్దరు అమ్మాయిలకూ చెబితే... వాళ్లూ సంతోషించారు. పైగా, ఈ సాయంవల్ల వచ్చే ప్రయోజనాల్ని మేం చూడాలంటే తక్షణమే పని మొదలుపెట్టాలన్నారు. సుబ్రతో, నేనూ మధ్యతరగతి నుంచే వచ్చాం. మా అమ్మానాన్నలు ఆర్థికంగా సాయం చేయలేకపోయినా, ఏదో ఒక రూపంలో చేయూతనిచ్చేవారు. మా ఇద్దరిలో పేదల పట్ల సానుభూతి వాళ్ల ద్వారానే అబ్బింది. సమాజసేవలో ఇదే మా మొదటి ప్రాజెక్టు కాదు. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వంతో కలసి మేం చేపట్టిన ‘మో స్కూల్‌’ కార్యక్రమం పేద పిల్లల్ని స్మార్ట్‌ తరగతులకు పరిచయం చేస్తోంది.

ఆ రెండు రాష్ట్రాల్లో...

మా మామయ్య (సుబ్రతో తండ్రి) మానసిక సమస్యతో, అత్తయ్య అంధత్వంతో, మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌, వృద్ధాప్య సమస్యలతో బాధపడ్డారు. వాళ్లు పడిన బాధలు వేరొకరు పడకూడదనీ, ఇలాంటి ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన వైద్యం అందించాలనీ పదేళ్ల క్రితమే నిర్ణయించుకున్నాం. గత ఏడాదిలో మదురైలోని అర్వింద్‌ కంటి ఆస్పత్రి, అహ్మదాబాద్‌ యూనివర్శిటీలకు రూ.150కోట్లు విరాళంగా ఇచ్చాం. రూ.350కోట్లతో శంకర క్యాన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌ (బెంగళూరు) సాయంతో క్యాన్సర్‌ ఆసుపత్రి, కరుణాశ్రయ సాయంతో క్యాన్సర్‌ బాధితులకు పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాలను భువనేశ్వర్‌లో నిర్మిస్తున్నాం. పక్కపక్కనే ఉండే ఈ కేంద్రాలకు ఒడిశా ప్రభుత్వం 20 ఎకరాల చొప్పున కేటాయించింది. ఒడిశా మా జన్మభూమి. కర్ణాటక మాకు పేరు ప్రఖ్యాతులూ సంపదా తెచ్చిన రాష్ట్రం. అందుకే ఇక్కడా ఏదైనా చేయాలనుకున్నాం. ఈ సాయం కొందరిలోనైనా స్ఫూర్తి నింపితే మేమెంతో సంతోషిస్తాం.

కె.ముకుంద, బెంగళూరు
 


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు