తాళిని తాకట్టుపెట్టి టీకప్పులు చేస్తున్నా

భర్తకు అనారోగ్యం... కొవిడ్‌ కారణంగా ఉన్న ఉద్యోగం పోయి దిక్కుతోచని సమయం. తనకొచ్చిన కష్టం మరెవరికీ ఎదురవ్వకూడదనే ఆలోచన నుంచే ఆమెకు ఉపాధి మార్గం దొరికింది.  వాడి పారేసే ప్లాస్టిక్‌ టీ కప్పుల స్థానంలో... తాగిన తర్వాత తినేసే కప్పుల తయారీని ఉపాధిగా ఎంచుకుంది. ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన తమ్మినైన జయలక్ష్మి...

మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌ అవ్వగానే పెళ్లిచేశారు. ముగ్గురు పిల్లలు. వాళ్లు కాస్త పెద్దయ్యాక ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు చదివా. ఇంగ్లిష్‌ మీద ఇష్టంతో గీతం యూనివర్సిటీ నుంచి ఎమ్మే ఇంగ్లిష్‌ కూడా పూర్తిచేశా. తర్వాత బీఈడీ. నేను వాలీబాల్లో రాష్ట్రస్థాయి క్రీడాకారిణిని కూడా. ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నించి... ప్రిలిమ్స్‌లో వెనుతిరిగాను. వేరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించినా నిరాశే ఎదురయ్యింది. ఇక ప్రైవేట్‌ టీచర్‌గా స్థిరపడి ఆయన భారం కాస్త తగ్గిద్దామనుకున్నా. ఇలా ఎందుకన్నానంటే... మావారు శ్రీనివాసరావు అకౌంటెంట్‌గా చేసేవారు. తొమ్మిదేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కారణం మాత్రం తెలిసేది కాదు. గ్యాస్ట్రిక్‌ అని ఒకరు... సాధారణ సమస్యే అని మరొకరు అనేవారు. చివరికి కడుపులో పేరుకున్న ప్లాస్టిక్‌ కారణంగా లోపల ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని, శస్త్రచికిత్స చేయాలని అన్నారు. అప్పట్నుంచీ ఆయన్ని కంటికిరెప్పలా చూసుకుంటూనే, ఆదాయ మార్గాలపైనా దృష్టి పెట్టాను. మరో వైపు నాకింత కష్టం తెచ్చిన ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం వెతకాలన్న పట్టుదలా ఎక్కువైంది.

సున్నా నుంచి మొదలుపెట్టి...

కొవిడ్‌ సమయంలో మా ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. పాఠశాలలు మూతపడటంతో నా ఉద్యోగం పోయింది. ఆయన అంతవరకూ చేస్తున్న పని కూడా చేయలేని పరిస్థితి. ఓ పక్క అనారోగ్యం ఎక్కువై ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్‌కి చేతిలో పైసా లేదు. ఎటూపాలుపోని పరిస్థితి. వంటిమీదున్న బంగారం మొత్తం తీసి గండం నుంచి బయటపడ్డాను. మరి అక్కడ నుంచి రోజులు ఎలా గడవాలి? ఓ పక్కన చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు. ‘ఈ రోజు నీకిది దక్కకపోతే అంతే ప్రాప్తం అనుకో! కానీ మరుసటి రోజు ఆ నిరాశలో ఉండకు. నీకోసం భగవంతుడు ఏదో ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడని నమ్ము’.. చిన్నప్పట్నుంచీ మా అమ్మ చెప్పిన ఈ మాటలు నేను పుట్టెడు కష్టంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రంలా పనిచేశాయి... అవే నన్ను ముందుకు నడిపించాయి. నా ప్రయాణం జీరో నుంచి మొదలయింది. మెళ్లో తాళి తాకట్టుపెట్టి... ఆ పెట్టుబడితో ప్లాస్టిక్‌ కప్పులకి బదులుగా ఈ తినే టీకప్పుల తయారీని మొదలుపెట్టాను. ఓ స్నేహితురాలు రెండు లక్షలు ఇచ్చి ఆదుకుంది. మొదట డీలర్‌షిప్‌ తీసుకుంటే చాలనుకున్నా. కానీ ఒక్కో కప్పు రూ.7 వరకు ఖర్చవుతోంది. అలా అయితే ఇవి సామాన్యులకు చేరువ కావు. అందరికీ అందుబాటులో ఉండాలంటే సొంతంగా పరిశ్రమను స్థాపించాలనుకున్నా. రుణం కోసం బ్యాంకుల చుట్టూతిరిగా. ఇలాంటి వ్యాపారం ఉందా? అంటూ చాలా బ్యాంకులు నమ్మలేదు. చివరికి కెనరా బ్యాంక్‌ వాళ్లు రూ.16లక్షల రుణం ఇచ్చారు. నా దగ్గరున్నవి కూడా కలిపి గత ఏడాది మార్చిలో శ్రీహర్ష ఎంటర్‌ప్రైజెస్‌ పరిశ్రమను స్థాపించా.

రాగి…, బియ్యప్పిండితో...

సాధారణంగా ఈ కప్పుల తయారీకి మైదాని వాడతారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దాని స్థానంలో పోషకాలు అందించే రాగిపిండి, బియ్యప్పిండి వాడి చాలా ప్రయోగాలు చేసి చివరికి అనుకున్నట్టుగా చేయగలిగాను. టీ ఎంత వేడిగా ఉన్నా కప్పులు ఏ మాత్రం కరగకుండా జాగ్రత్తలు తీసుకున్నా. తర్వాత వీటిని తినేయొచ్చు. కానీ వీటిని అమ్మడం అంత తేలిక కాలేదు. ఇవాళ ఓ పదికప్పులు అమ్ముడుపోతే చాలు అనుకున్న సందర్భాలు బోలెడు. మార్కెటింగ్‌ కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి నెమ్మదిగా ఆర్డర్లు సంపాదించే దాన్ని. సమయానికి ఆర్డర్లు అందించడం కోసం రాత్రుళ్లు ఒక్కదాన్నే ఉండి, పని పూర్తి చేసుకుని ఎప్పటికో ఇల్లు చేరుకునేదాన్ని. మా కప్పుల నాణ్యత బాగుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యింది. ప్రస్తుతం ఒడిశా, రాజస్థాన్‌, గుజరాత్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. నేను కూడా మా కప్పుల గురించి స్థానికంగా నలుగురికీ తెలియడం కోసం ఒక అవుట్‌లెట్‌ను ప్రారంభించా. ఇప్పుడు నెలకి లక్ష కప్పులు తయారు చేస్తున్నా. 35లక్షల నుంచి రూ.40లక్షల మేర వ్యాపారం చేస్తున్నాం. మరికొందరికి ఉపాధీ కల్పించగలుగుతున్నా. అన్నట్టు మా అమ్మాయి పూజిత ఎంబీయే చదువుతోంది. అబ్బాయిలు హర్షవర్ధన్‌ ఇంజినీరింగ్‌, శ్రీహర్ష ఇంటర్‌. అంత తేలిగ్గా దేన్నీ వదలుకోవద్దు అని నాన్న అనేవారు. మా నాన్న మాటలే నాకు ఆదర్శం.

-ఆనంద్‌ పసుపులేటి, విశాఖపట్నం


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు