
కేకులతో అంతర్జాతీయ స్థాయికి...
కేక్ ఆర్టిస్ట్.. ఈ పదం ఇప్పుడు చాలామందికి సుపరిచితమే. కానీ పదిహేనేళ్ల క్రితమే ఈ రంగంలోకి అడుగుపెట్టారు సాఫ్ట్వేర్ ఇంజినీర్.. అశ్విని. ప్రపంచవ్యాప్తంగా అరుదైన కేక్ ఆర్టిస్ట్‌ల్లో ఒకరిగా గుర్తింపు సాధించడమే కాదు.. అకాడమీని స్థాపించి, వేలమందికి శిక్షణనీ అందించారు. ఈ హైదరాబాదీ అరుదైన ప్రయాణం.. ఆమె మాటల్లోనే!
చిన్నప్పటి నుంచీ సృజనాత్మకత, ఆర్ట్స్ ఉన్నవేవైనా నన్ను ఇట్టే ఆకర్షించేవి. అందుకే బొమ్మలు గీయడం, పెయింటింగ్, క్రాఫ్ట్స్, అల్లికలు.. ఇలా ప్రతిదీ నేర్చుకున్నా. మంచి విద్యార్థినిని. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదివా. ఇన్ఫోసిస్‌లో ఏడున్నరేళ్లు పనిచేశా. ఓసారి పనిలో భాగంగా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ సమయాల్లో అక్కడి ఆర్ట్, క్రాఫ్ట్ సంస్థల కెళ్లేదాన్ని. నచ్చిన వాటిల్లో కోర్సులు చేసేదాన్ని. ఓసారి కేక్ క్రాఫ్ట్ చూశా. అప్పటివరకూ దానిపై నాకు అవగాహనే లేదు. కేక్ అంటే.. మా పుట్టినరోజులకు అమ్మ చేసేదే. ఓసారి నా స్నేహితురాలు చేస్తోంటే.. నేర్చుకోవాలనిపించింది. కానీ కేక్ క్రాఫ్ట్ ఇంకా కొత్తగా అనిపించింది. ఆసక్తి కలిగి షార్ట్‌టర్మ్ కోర్సులో చేరా. బాగా నచ్చి మాస్టర్ కోర్సుతోపాటు ఎంతోమంది నిపుణుల దగ్గర నైపుణ్యాలూ నేర్చుకున్నా. న్యూయార్క్ కలినరీ ఎడ్యుకేషన్ నుంచి బేకింగ్‌లో పట్టానీ పొందా.
అక్కడున్నప్పుడే కేక్ తయారీ పోటీల్లో పాల్గొన్నా. వాటిల్లో గెలుపు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. బాగా నచ్చిన పని, పైగా నైపుణ్యముంది. సొంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. ఇంట్లో వాళ్లతో చెబితే ‘నీకు నచ్చిందే చెయ్యి’ అన్నారు. ఉద్యోగం మానేశా. పెళ్లయ్యాక పుణె వెళ్లాల్సొచ్చింది. అక్కడే 2006లో ‘డ్రీమ్ కేక్స్’ ప్రారంభించా. ఇదో డిజైనర్ కేక్ బొతిక్. చక్కెరతో సందర్భాన్ని బట్టి వివిధ రూపాలతోపాటు నిజమైన పూలలా రూపొందించి కేక్‌ను అలంకరించేదాన్ని. నా పనితనం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. కోరినవారికి నేర్పేదాన్ని కూడా. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాం. ఇక్కడా ఎంతోమంది ఆడవాళ్లు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, అవకాశం లేక ఆగిపోవడం చూశా. అప్పుడే వాళ్లకోసం అకాడమీ ప్రారంభించాలనుకున్నా. ఇంటర్నేషనల్ కేక్ ఎక్స్‌ప్లోరేషన్ సొసైటీ గుర్తింపునీ పొందా. 2012లో ఆన్లైన్లో ‘డ్రీమ్ కేక్స్ అకాడమీ’ని ప్రారంభించా. దేశంలోనే మొదటి ఆన్లైన్ కేక్ అకాడమీ ఇది. తర్వాత ఆఫ్లైన్లోనూ కొనసాగించా. కొవిడ్ కారణంగా ఇప్పుడు ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నాం.
నేను భారత్‌లో ప్రారంభించే నాటికి ‘కేక్ ఆర్టిస్ట్’ అన్న పదమే పరిచయం లేదు. కేకుల్లో రకాలూ తెలిసేవి కాదు. కొందరు కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నా తగిన సమయం ఇచ్చేవాళ్లు కాదు. తయారీకి కావాల్సిన వాటికీ విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. దీనికి తోడు పిల్లలు. సమన్వయం చేసుకోవడం కొంత కష్టమయ్యేది. ఆన్లైన్ తరగతులపైనా అవగాహన తక్కువే. అనుభవం, సహనంతోనే ఒక్కో అడుగూ వేసుకుంటూ వచ్చా. ఇప్పుడు ప్రత్యామ్నాయాలుగా వేటిని వాడొచ్చో తెలుసు. ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతులూ ఎన్నో! యూకే కేక్ మాస్టర్స్ మ్యాగజైన్ ఎంపిక చేసిన 10మంది ఉత్తమ కేక్ ఆర్టిస్ట్‌ల్లో ఒకరిగా వరుస రెండేళ్లు (2017, 2018) నిలిచా. చక్కెరతో నిజమైన పూలను తలపించేలా చేయడంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందా. కేక్ మాస్టర్స్ మ్యాగజైన్.. కేక్ ఆస్కార్గా పిలిచే దీనిలో రెండుసార్లు చివరి దశవరకూ వెళ్లా. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టీవీ పోటీల్లో న్యాయనిర్ణేతగానూ పాల్గొన్నా. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై నా కళను ప్రదర్శించా. దాదాపు పదివేలమందికి శిక్షణనిచ్చా. ఎంతోమంది సొంత వ్యాపారాలు ప్రారంభించడమే కాదు.. నాలా నేర్పిస్తున్నారు కూడా. నా ప్రతి నిర్ణయంలో నా కుటుంబం తోడు నిలిచింది. మా పిల్లలూ ప్రిన్సెస్ బేక్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు.
నిరంతరం నేర్చుకోవడాన్ని నమ్ముతా, పాటిస్తా కూడా. అప్పుడే ఏదైనా సాధించగలం. ప్రతిసారీ ‘తర్వాతేంటి?’ అన్న ప్రశ్న వేసుకుంటా. అదే ముందుకెళ్లేలా చేస్తోంది. ఏదైనా చేశామనిపించగానే ఈ ప్రశ్న వేసుకోండి. అలాగే ఏదీ మొదలుపెట్టగానే దక్కేయదు. నిరంతర సాధనా కావాలి.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!