
నాయనమ్మ పేరు చెడగొట్టద్దని...!
‘చదువులో మార్కులు కాసిని తక్కువైనా ఫర్వాలేదు... సంగీతంలో ఏమాత్రం తగ్గొద్దు’ అని ప్రోత్సహించే సంగీత ప్రేమికుల కుటుంబం ఆమెది. అవసరమైతే అవకాశాలనీ అందించగలరు. తను మాత్రం వాటిని కాదనుకుని అమ్మాయిలు అరుదుగా అడుగుపెట్టే రంగంలోకి వచ్చి రాణిస్తోంది. అలవైకుంఠపురంలో, వకీల్‌సాబ్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలకు గిటారిస్టుగా పనిచేసి తానేంటో నిరూపించుకుంది. గానకోకిల పి.సుశీల మనవరాలిగా కాక.. గిటారిస్ట్ శుభశ్రీగా ఎదుగుతోన్న ఈ యువతేజం తన సంగీత ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా...
వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా, ఎప్పుడు చెన్నైలో వాలిపోదామా అన్నట్టుండేది చిన్నప్పుడు. అందుకు మొదటి కారణం నాయనమ్మ. ఏదైనా అడిగినపుడు అమ్మా నాన్నా కొన్నిసార్లు వద్దనేవారు. నాయనమ్మ మాత్రం అడగక ముందే అన్నీ కొనిచ్చేది. ఏదైనా కావాలన్నానంటే కచ్చితంగా అది నా చేతిలో ఉండేది. అంతలా గారాబం చేసేది. రెండో కారణం సంగీతం. నాకపుడు ఏడెనిమిదేళ్లు ఉంటాయి... ఓసారి చెన్నై వెళ్లినపుడు నాయనమ్మ గిటార్ కొనిచ్చింది. దాన్ని పట్టుకోగానే గమ్మత్తుగా అనిపించింది. సరదాగా ప్లే చేస్తూ ఉండే దాన్ని. హైదరాబాద్ తిరిగి వచ్చాక యూట్యూబ్‌లో చూస్తూ ప్రాథమిక విషయాలు నేర్చుకున్నా. ఏడాది తర్వాత వెళ్లినపుడు నాతోపాటు ఆ గిటార్ పట్టుకెళ్లడం చూసిన నాయనమ్మ.. నా ఆసక్తి అందులో ఉందని సదానందం గారి దగ్గర శిక్షణ ఇప్పించింది. ఆయన ఇళయరాజా బృందంలో ప్రధాన గిటారిస్ట్. ఉదయం ఏడింటికే వాళ్లింటికి వెళ్లి, సాయంత్రం వరకూ పాఠాలు నేర్చుకునే దాన్ని. ఆరేడేళ్లు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నా. ఆయన మ్యూజిక్ స్టోర్లకు తీసుకువెళ్లి రకరకాల గిటార్లు చూపించి వాటి ప్రత్యేకతలు చెప్పేవారు. నాకో గిటార్ బహుమతిగా ఇచ్చారు కూడా. హైదరాబాద్‌లో ఉంటే మాత్రం యూట్యూబ్‌లో చూసి కొత్త విషయాలు తెలుసుకుంటూ ప్రాక్టీసు చేసేదాన్ని. ఏఆర్ రెహ్మాన్, తమన్, అనిరుధ్... ఆల్బమ్స్ వింటూ కూడా చాలా నేర్చుకున్నా. ఆ క్రమంలోనే గిటారిస్టు కావాలనుకున్నా.
పరీక్షించకుండానే చేర్చుకున్నారు..
నాపై నమ్మకం వచ్చాక గిటారిస్ట్‌గా కెరియర్ ప్రారంభించా. అమ్మ గాయకురాలు. తన పరిచయస్థులు తమన్‌గారి బృందంలో ఉన్నారు. వాళ్లు ఆయనకు నాగురించి చెప్పడంతో ఓరోజు పిలిచారు. ప్రశ్నలేవీ అడగలేదు. అప్పటికి ఆయన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం చేస్తున్నారు. ఆ టీమ్‌లో నన్నూ చేర్చుకుని ‘సామజవరగమన’, ‘రాములో రాములా...’ ట్యూన్లు వినిపించి ఎక్కడెక్కడ గిటార్ ప్లే చేయాలో చెప్పారు. తర్వాత వెంకీమామ, వకీల్ సాబ్, గని, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ (నేపథ్య సంగీతం) సినిమాలకు పని చేశా. తమిళంలోనూ కొన్ని సినిమాలకు చేశా. సంగీత దర్శకురాల్ని కావాలనేది నా లక్ష్యం. ఈ విషయంలో తమన్ నాకు స్ఫూర్తి, మార్గదర్శి. ఆయన బృందంలో చేరాకే మ్యూజిక్ ప్రోగ్రామింగ్ గురించి కూడా తెలుసుకుంటున్నా. టీమ్‌తో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నా. పియానో కూడా నేర్చుకున్నా. అయిదేళ్లలో నా లక్ష్యం చేరుకోగలనన్నది నా నమ్మకం.
చదువుకున్నది హైదరాబాద్‌లో...
నాన్న జయకృష్ణ, అమ్మ సంధ్య. నాన్న నిర్మాణ రంగ వ్యాపారి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నర్సరీ నుంచి డిగ్రీ (బీబీఏ) వరకూ ఇక్కడే చదివా. అమ్మ.. తెలుగు, తమిళ సినిమాల్లో చాలా పాటలు పాడింది. నాన్నకీ సంగీతంలో ప్రావీణ్యం ఉంది. పియానో, తబలా అద్భుతంగా వాయిస్తారు. సంగీతానికి సంబంధించి చాలా విషయాలు వీళ్ల దగ్గరే నేర్చుకున్నా. వాళ్లిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ‘నాయనమ్మ, అమ్మలా నువ్వూ గాయనివి కావొచ్చుగా’ అని చాలామంది సూచించారు. కానీ మొదట్నుంచీ గిటార్పైనే ఆసక్తి. నాయనమ్మ పాటలు వింటుంటా. ఆమె కార్యక్రమాలకీ వెళ్లాను. ఆమె స్థాయిని అందుకోలేనని అర్థమైంది. ఉన్నపేరు పోగొట్టకూడదనిపించింది. అందుకే గాయనిగా మారే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. నాయనమ్మ ఎప్పుడైనా పాడమని అడిగినా... ‘మీరు పాడండి... నేను గిటార్ వాయిస్తా’నంటూ ఆమె పక్కన కూర్చుంటా. ఆమెతో సరదాగా గడుపుతూనే చాలా విషయాలు నేర్చుకుంటా. అక్క జయశ్రీ ఇంటీరియర్ డిజైనర్. నేను గాయనిని కాకపోయినా సంగీత రంగంలో ఉన్నందుకు మా వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. చదువుకునేటపుడు కూడా... ‘మార్కులు తక్కువైనా ఫర్వాలేదు.. సంగీతం మాత్రం బాగా నేర్చుకో’ అనే వారు. మా కజిన్స్ అంతా కలిసినా కూడా దాన్ని గురించి మాట్లాడు కుంటాం. పాటలు పాడుతూ సంగీత వాద్యాలు వాయిస్తూ కాలక్షేపం చేస్తాం. పదిమంది ముందు నిలబడి ప్రదర్శనలు ఇవ్వాలంటే తెలియని బిడియం. కానీ ఈ మధ్య సినిమా కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడంతో ఆ భయం క్రమంగా పోయింది.
త్వరలోనే పెళ్లి...
ఫ్యాషన్లు, పర్యటనలంటే ఇష్టం. నాకిపుడు 22. కొన్ని నెలల కిందట వరకూ పెళ్లి ఆలోచనే లేదు. వినయ్‌ను చూశాక ఆలోచన మారింది. మాకు వారి కుటుంబం తెలుసు. ‘ఒకసారి కలిసి మాట్లాడి చూడు’ అన్నారు అమ్మా నాన్న. మాట్లాడుకున్నాక మాత్రం ‘ఒకరికి ఒకరం’ అని నిర్ణయించుకున్నాం. తను దుబాయిలో వ్యాపారవేత్త. ఈ మధ్యే మా నిశ్చితార్థం జరిగింది. మేలో పెళ్లి. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం మాది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ఇయాన్ హీలీ ‘పిచ్’ వ్యాఖ్యలకు జాన్ రైట్ కౌంటర్..
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు