
ప్రియాంక, ఆలియా మా చీరలే కడతారు...
ఆలియా భట్.. తన తాజా సినిమా ప్రచారంలో భాగంగా ఓ తెలుపు రంగు జాందానీ చీరను కట్టింది. అది బెంగళూరుకు చెందిన ఓ బొటిక్ రూపొందించిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి బాలీవుడ్‌తోపాటు తెలుగు తారలూ భారతీ హరీష్ డిజైన్లకు ఫిదా అయినవారే. సంప్రదాయ వస్త్రంతో తారల్ని ఆకర్షించడమే కాదు, వెయ్యికిపైగా చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుందీమె. వసుంధర పలకరించగా.. ఆ విషయాలను పంచుకుందిలా!
చిన్నప్పట్నుంచీ నానమ్మతో నాకు అనుబంధమెక్కువ. ఆమె ఇష్టపడే కాంచీపురం చీరల్ని ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపరుచుకున్నా. వాటిని పట్టుకుంటే తన ప్రేమ నాతోనే ఉందన్న అనుభూతి. అదే నన్నూ వాటివైపు ఆకర్షించింది. కానీ వాటిని నేసేవారు కనుమరుగవుతుండటం బాధేసింది. కొద్దో గొప్పో ఉన్నా.. వయసు పైబడినవారే. కొత్త తరం వాటిని అందిపుచ్చుకోవడానికే ఆసక్తి చూపడం లేదు. ఇలాగైతే కొన్నేళ్లలో కంచి చీరలు మ్యూజియానికే పరిమితం అవుతాయేమోనన్న భయం వేసింది. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే బెంగళూరులో ‘మాధుర్య క్రియేషన్స్’ ప్రారంభించా. ఆదరణ లేకపోవడం వల్లే కదా నేత పనికి ఎవరూ ముందుకు రావడం లేదు. వాళ్లకి కొనుగోలుదారులను చూపించడం మా లక్ష్యమన్నమాట.
దేన్నైనా ఇష్టపడితే మార్గం దానంతట అదే కనిపిస్తుందంటారు కదా! నా విషయంలో అదే రుజువైంది. నాకు వీటిపై ఉన్న ఆసక్తే.. వినియోగదారుల కోసం ప్రయత్నించేలా చేసింది. మొదట నేతపని వారిని కలిశా. వారి పనితీరు, ప్రత్యేకతను ముందుగా తెలుసుకున్నా. ఇప్పటికీ మన దేశంలో ఎన్నో రాజకుటుంబాలున్నాయి. ఒకప్పుడు నేతవారిని ఆదరించింది వారే! ముందు వారిని కలిసి వస్త్ర విలువ, ప్రత్యేకతలను వివరించా. తర్వాత నేత వారి కోసం పనిచేస్తోన్న కొన్ని సంస్థలతోనూ కలిసి పనిచేశా. దీంతో నెమ్మదిగా ఆదరణ పెరిగింది. రాజకుటుంబాలూ ముందుకు రావడంతో డిజైనర్ల దృష్టీ పడింది. అలా వస్త్ర సంస్థలూ.. మా సేవలు పొందడానికి ముందుకొచ్చాయి.
రెండింటితో అద్భుతం.. చేనేత వెనుక పడటానికి ఆధునికతను అందిపుచ్చుకోకపోవడమూ ఓ కారణమే. అందుకే తాజా ధోరణులకు అనుగుణంగా కొత్త ప్రయోగాలు చేసేలా నేతకారులను ప్రోత్సహించా. అవసరమైతే శిక్షణనీ ఇప్పించా. నేను బిట్స్ పిలానీ నుంచి ఇంజినీరింగ్ చేశా. దీనికీ, డిజైన్కీ పొంతన కుదరదు కదా అనేవారే చాలామంది. ఎందుకు కుదరదు? చిన్న చిన్న అంశాలనీ క్షుణ్ణంగా చూడటం, సాంకేతికత వినియోగం ఇంజినీరింగ్ నేపథ్యంవల్ల సాధ్యమవుతుంది. డిజైనింగ్ సృజనాత్మకతకు సంబంధించింది. రెండూ కుదిరితే అద్భుతాలు సృష్టించొచ్చు. నేనే అందుకు ఉదాహరణ. అయితే అనుకోని లాక్డౌన్ మాకు కొంత దెబ్బే. చాలా కుటుంబాలు కనీసం తినడానికీ లేక కష్టపడ్డాయి. దీనికి తోడు చేతిలో సరకు. ఆదుకోమని ఎన్నో అర్థింపులు. దీంతో ఆ సమయంలోనే ఖాళీగా ఉండలేదు. ఆన్లైన్లో సేవలను ప్రారంభించాం. కన్నడ అమ్మాయినైనా.. ఇతర ప్రాంతాల నేతకారులకీ ప్రాధాన్యమిస్తున్నా. కాంచీపురం, ఉప్పాడ, బనారస్, చందేరి, ఫులియా, ఇక్కత్ దాదాపుగా అన్నిరకాల వారితో పనిచేస్తున్నా. ఇప్పుడు దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా కుటుంబాలు మాతో కలిసి నడుస్తున్నాయి. దీనికితోడు కొన్నింటిని రీడిజైన్ చేసి నేరుగానూ అమ్ముతున్నాం.
మొదట ప్రియాంక చోప్రా.. మా సేవల్ని తెలుసుకుని మొదటిసారి ప్రియాంక చోప్రా సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించడమేకాక పద్మశ్రీ అవార్డు అందుకున్నపుడు మేం రూపొందించిన జాందానీ చీరనే కట్టుకుంది. కంగనా కేన్స్‌లో రెడ్‌కార్పెట్‌పై నడవడానికీ మాతోనే చీర డిజైన్ చేయించుకుంది. ఆలియాకు పండుగలు, వేడుకల సమయాల్లో చేసిస్తుంటాం. సారా అలీఖాన్, సమంత, కాజల్ అగర్వాల్.. ఇలా ఎందరో ప్రముఖులు పలు సందర్భాల్లో మా సేవలు పొందినవారే. వీరివల్లా గుర్తింపు పెరిగింది. ఫాస్ట్ ఫ్యాషన్ ఇప్పుడు మా ముందున్న పెద్ద సవాలు. యువత సంప్రదాయ వస్త్రాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వాళ్లకి అనుగుణంగా మార్పులు చేస్తూనే చేనేతపై అవగాహననీ కల్పిస్తున్నాం.
ఎంచుకున్న మార్గం సులువు కాదని ముందే తెలుసు. కాకపోతే ఇష్టపడింది కాబట్టి, కష్టంగా తోయదు. అందుకే ఏ రంగం ఎంచుకున్నా.. దాన్ని ప్రేమించమని చెబుతా. పైగా నేను చేస్తున్నది ఎంతోమంది జీవితాల్లో సంతోషాలను నింపుతోంది. వాళ్ల చిరునవ్వు చూసినప్పుడు ఏదో సంతృప్తి. అన్నట్టు.. మా లాభాల్లో కొంత భాగాన్ని సమాజ సేవకీ వినియోగిస్తున్నాం. బాలికల విద్యకోసం కొంత దాన్ని వినియోగిస్తున్నాం. మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నా.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు