కొడుకు చదువు కోసం.. కాలు బయట పెట్టింది!

ఇల్లు, కొడుకు ఇదే ఆమె లోకం. తన వరకూ ఎన్ని కష్టాలెదురైనా ఓర్చుకుంది. కొడుకు విషయానికొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అందరికీ ఎదురు తిరిగింది. వీధి కన్నెరుగని ఆమె దేశమంతా పర్యటిస్తోంది. కొడుకుని ఉన్నతవిద్యకు లండన్‌ పంపింది. భర్తకు సొంత వ్యాపారాన్ని చేకూర్చింది. మీనూ జైన్‌కి ఇదంతా ఎలా సాధ్యమైంది? హైదరాబాద్‌ వచ్చిన మీనూ ‘వసుంధర’తో పంచుకుంది.

గృహిణిగా ఇంటెడు చాకిరీ చేస్తూ....కుమారుడి ఆలనాపాలనా చూసుకోవడం.. భర్త, అత్తమామలకు సపర్యలు చేయడం...మొదట్లో నా జీవితమిదే. మాది దక్షిణ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబం. భర్త సంపాదనే మార్గం. దీంతో ఎప్పుడూ ఆర్థిక కష్టాలే. అవప్పుడు మావరకే. కాబట్టి, ఇదంతా సాధారణమే అనిపించేది. ఇంతలో బాబును పాఠశాలలో చేర్చే రోజు వచ్చింది. ఇంట్లో వాళ్లందరూ దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దామని నిర్ణయించారు. నేను ససేమిరా అన్నాను. అప్పట్లో స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అంతంత మాత్రమే అని చుట్టుపక్కల వాళ్లు చెబుతోంటే విన్నా. ఉపాధ్యాయులూ సరిగా హాజరు అయ్యేవారు కారట. ఇలాంటి కారణాలు బోలెడు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి పంపి వాడి భవిష్యత్‌ను ఎలా పాడు చేయగలను? అందుకే ప్రైవేటు పాఠశాలకు పంపాలని పట్టుబట్టా. ఇంట్లోవాళ్లేమో అంత స్థోమత లేదని వారించారు. నేను మాత్రం అలా వదిలేయదలచుకోలేదు. కొద్దిరోజుల పాటు కుటుంబసభ్యులతో వాగ్వాదం కొనసాగింది.

వాళ్లను ఒప్పించలేనని అర్థమైంది. నేను ఇంటర్‌ వరకూ చదివా. చిన్నపాటి ఉద్యోగం చేసైనా నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలోనే చేరుస్తానన్నా. ఇదంతా జరిగింది 2002లో. నేను కాలు బయట పెట్టడం వాళ్లకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంట్లో ఉండే ఏదైనా వ్యాపారం చేసుకోమన్నారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచే రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ పుట్టినరోజు, ఇతర వేడుకలు పంపడం మొదలుపెట్టా. నా వంటలు రుచికరంగా ఉండటంతో నెమ్మదిగా ఆర్డర్లు పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇంట్లోవాళ్లూ నా ఆలోచనను అర్థం చేసుకున్నారు. బాబునీ మంచి స్కూల్లో చేర్పించా. మా ఇంటికి సమీపంలో ఓ మైదానం ఉంది. అక్కడ హునర్‌ హాత్‌ స్టాల్‌ ఏర్పాటు చేసే అవకాశమొచ్చింది. వీటిని కేంద్రప్రభుత్వం ఏటా వివిధ రాష్ట్రాల్లో ఏడు నుంచి పదిసార్లు నిర్వహిస్తుంది. నేనూ స్టాల్‌ ఏర్పాటు చేస్తానన్నా. ఇంట్లోవాళ్లు మొదట్లోలాగే ఒప్పుకోలేదు. ‘మహిళవి! బయటికెలా వెళతావు? నలుగురూ ఏమనుకుంటారు? ఇంట్లోనే ఉండు’ అంటూ వారించారు. ఎప్పట్లాగే నేనూ పట్టువిడవలేదు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం అదే మొదటిసారి.

ఇప్పటివరకూ సుమారు 25 హునర్‌హాత్‌ ప్రదర్శనల్లో పాల్గొన్నా. వివిధ రాష్ట్రాలు తిరిగా. మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు తెలియని భయం. అందరికీ వంటలు నచ్చుతాయా అన్న సంశయం. మెప్పించగలనా అన్న సందేహం. కానీ చాలామంది మెచ్చుకున్నారు. సొంత ప్రదేశం.. సరే! ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడూ ఎలా నెట్టుకొస్తానన్న భయం. కానీ నా బాబుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యమే నన్ను నడిపింది. ఎన్నో కొత్త విషయాలు, వంటలు నేర్చుకునేలా చేసింది. ఇప్పుడు దిల్లీ చాట్‌ నుంచి ఆలూ టిక్కీ, దహీ వడా, చోలే బటూరే, పాప్డీ చాట్‌, పానీపూరీ, సేవ్‌పూరీ, పావ్‌బాజీలే కాదు..  ఇతర ఉత్తర, దక్షిణ భారత వంటల్నీ చేస్తున్నా. ఎంతో మంది నేను చేసింది నచ్చి ‘భారీ వేడుకలకు వెళ్లాం కానీ.. ఇలాంటి ఛాట్‌ ఎక్కడా తినలేదం’టుంటారు. ఆ ప్రశంసలు వింటే చాలా ఆనందమేస్తోంది. ప్రదర్శనల్లో పాల్గొననప్పుడు ఇంటి దగ్గర వేడుకలకు చేసిపెడుతుంటా. వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. నాతోపాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నా. ఏడాదికి రూ.8 లక్షలపైనే సంపాదిస్తున్నా. నా సొంతింటి కలను సాకారం చేసుకున్నా. నా కొడుకును ఉన్నతంగా చూడాలన్న నాలక్ష్యమూ నెరవేరింది. ఇప్పుడు తను లండన్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. మావారికీ ఇంటీరియర్‌ వ్యాపారం పెట్టించా. నా కష్టాల జీవితం నా కొడుక్కి దూరమైనట్టే!

- కాసాల ప్రశాంత్‌ గౌడ్‌, హైదరాబాద్‌


నం నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు సాగాలి. మన ఆలోచనలను కించపరిచే లేదా నెగ్గనివ్వని పరిస్థితి ఎదురైతే దిగులు పడటం కాదు, బహిరంగంగా పోరాడాలి. ఎంచుకున్న రంగంలో వృద్ధి సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయండి. వ్యక్తిగత లబ్ధి కోసం ఎవరో ఏదో చెబుతుంటారు. మనం స్వయంగా రంగంలోకి దిగి, ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఉత్తమం. మనకంటూ ఒక స్పష్టత ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు నిర్దుష్టంగా ఉంటాయి. నిర్ధారించుకున్న దాన్ని తక్షణం అమలుపరచాలి. అవరోధాలకు వెనకడుగు వేస్తే ఎదుగుదల ఆగిపోతుంది. జాప్యాలూ, వాయిదాలూ ముందుకు సాగనివ్వవు.  

- వినిత డి. గుప్తా, సీఈఓ, లుపిన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీమరిన్ని