ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌మాస్టర్‌ అదే నా లక్ష్యం...

తెలియని వయసులో సరదాగా చదరంగంలోకి అడుగుపెట్టింది. చుట్టూ ఉన్నవాళ్లు ఆమె నైపుణ్యాన్ని చూశారు. సాధన పెంచితే రాణిస్తుంది అనుకున్నారు. నచ్చిన ఆట ఆడుకోనిస్తున్నారని ఆనందపడిన తనకి ఆ ఆటే లోకమైంది. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు అన్నింటా జయకేతనం ఎగరేస్తూ... తాజాగా విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌నూ అందుకుంది. ఈ ఘనత సాధించిన నాలుగో తెలుగమ్మాయిగా నిలిచింది. తనే నూతక్కి ప్రియాంక.. ఈ యువతేజాన్ని వసుంధర పలకరించింది!

అప్పుడు నాకు ఏడో ఏడు.. అమ్మానాన్నా వేసవి శిక్షణ శిబిరంలో చేర్చారు. అక్కడున్న ఆటలన్నీ ఆడా. చదరంగంలో మాత్రం మెలకువలు త్వరగా నేర్చుకున్నా. ఎంతలా అంటే.. రెండు నెలల్లోనే అండర్‌ 7 డిస్ట్రిక్‌ ఛాంపియన్‌, రాష్ట్రస్థాయిలో వెండి పతకం సాధించేంతలా. నా ఆటతీరు చూసి శిక్షకులు ప్రొఫెషనల్‌గా ప్రయత్నించమన్నారు. ఇంట్లో వాళ్లూ సరేనని ఓ ఏడాది చదువు పక్కన పెట్టించి శిక్షణనిప్పించారు. మాది విజయవాడ. నాన్న రాధాకృష్ణ స్టేషనరీ వ్యాపారి. అమ్మ దుర్గాదేవి. అక్క.. సింధుశ్రీ. తర్వాతి నుంచి పాల్గొన్న ప్రతి పోటీలోనూ విజయమే. అండర్‌ 9 కేటగిరీలో జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకూ; అండర్‌ 10 వరల్డ్‌, ఆసియా స్థాయిల్లోనూ గెలిచా. ఆసియా పరిధిలో ఆరు బంగారు పతకాలొచ్చాయి. అదప్పుడు రికార్డు. అండర్‌ 11, 13 నేషనల్‌ ఛాంపియన్‌ని. ఎన్నో అంతర్జాతీయ పతకాలనూ గెలిచా. 2018లో విమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌, తాజాగా విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) టైటిళ్లు సాధించా. డబ్ల్యూజీఎంను మన దేశం నుంచి 23 మంది అందుకోగా తెలుగు వాళ్లలో నేను నాలుగోదాన్ని. విమెన్‌ నేషనల్‌ సీనియర్‌ పోటీలో కాంస్యం గెలిచా.

లక్ష్యం మారుతుంది
ఏడాదిలో సగటున 8 టోర్నమెంట్ల వరకూ పాల్గొంటా. దీంతో పాఠశాలకు వెళ్లింది తక్కువే. ప్రస్తుతం బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నా. పరీక్షలప్పుడు రెండు నెలలు మాత్రం చదువుపైనే దృష్టి పెడతా. నా రోజులో ఎక్కువ భాగం ఆట సన్నద్ధతకే. సందేహాలొస్తే కోచ్‌.. స్వయమ్స్‌ మిశ్రా సాయం తీసుకుంటా. అందరి ఆటనీ ఆస్వాదిస్తా. ‘జుడిత్‌ పోల్గర్‌’ ఆటని మాత్రం బాగా ఇష్టపడతా. నేను చెస్‌ మొదలెట్టిన కొత్తలో ఆమె ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి. మహిళ, ఓపెన్‌.. రెండింట్లోనూ పోటీ చేసేవారావిడ. తనే స్ఫూర్తి నాకు. ఆమెలా అగ్రస్థానాన నిలవాలనుంది.

సొంత ఖర్చే..
అండర్‌ 10 వరల్డ్‌ ఛాంపియన్‌ అవడం.. మర్చిపోలేని అనుభూతి. ఏమాత్రం అవగాహన, అంచనాల్లేకుండా పాల్గొన్న పోటీ అది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి నగదు ప్రోత్సాహకమందుకున్నా. ఇటీవలి జాతీయ స్థాయి ప్రదర్శన, డబ్ల్యూజీఎం టైటిల్‌ కూడా ప్రత్యేకమే. సొంత ఖర్చుతోనే పోటీలకు వెళ్తున్నా. గెలిచిన నగదునీ వీటికే కేటాయిస్తున్నా. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వాళ్లతో రెండేళ్లుగా కాంట్రాక్టులో ఉన్నా. చెస్‌కి ఇప్పుడు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నా. ఊహ తెలిసినప్పటి నుంచీ చెస్సే లోకం. బాల్యాన్ని కోల్పోయానా అంటే.. మొదట బడి మానేసినప్పుడు చాలా చిన్నపిల్లను. పైగా నేర్చుకునే చోటా చాలామంది స్నేహితులవడంతో తేడా తెలియలేదు. తర్వాత్తర్వాత ఇతరులతో పోల్చుకుంటే తేడా తెలిసేది. అయితే ఆట నా ఇష్టమైన వ్యాపకం. అమ్మానాన్న, అక్క బాగా ప్రోత్సహించేవారు. నాకిప్పుడు 19 ఏళ్లు. గుర్తింపు తెచ్చే విజయాలు సాధించా. ఇవన్నీ చూస్తే.. అదో పెద్ద విషయంలా అనిపించట్లేదు.
* చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని పూర్తి చేసుకుంటూ వెళ్లడం నాకలవాటు. మొన్నటివరకూ విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నా లక్ష్యం. అది పూర్తయ్యింది. కాబట్టి, ఈ ఏడాది చివరికల్లా ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌మాస్టర్‌ అవ్వాలని పెట్టుకున్నా. దానికోసం విదేశాల్లో స్కాలర్‌షిప్‌తో డిగ్రీ అవకాశమొచ్చినా వదులుకున్నా.
* వ్యాయామం కోసం బ్యాడ్మింటన్‌, టీటీ ఆడతా.
* ఒత్తిడి ఎరగను కానీ.. ముఖ్యమైన రౌండ్లప్పుడు ఆందోళన అనిపిస్తే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతా. ధాన్యం చేస్తా.
* ఏ రంగమైనా పోటీ ఉంటుంది. ఓపిక, నిలకడతో సాగాలి. కొద్దిరోజులకే ఫలితం రాలేదని డీలా పడి పోవద్దు.
* రోజూ ఎంత ప్రయత్నించామన్నది ముఖ్యం. అప్పుడు విజయమే వెతుక్కుంటూ వస్తుంది.

- తాతినేని పూర్ణిమా శ్రీనివాసరావు, విజయవాడ


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని