China: అమెరికాతో అన్ని ఒప్పందాలపై చర్చలు రద్దు

ప్రతీకార చర్యలకు దిగిన చైనా
పెలోసీ కుటుంబంపైనా నిషేధం

బీజింగ్‌, టోక్యో, వాషింగ్టన్‌, నాంఫెన్‌ (కాంబోడియా): వద్దని వారించినా తమ మాట బేఖాతరు చేసి తైవాన్‌ను సందర్శించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసీ పర్యటనపై చైనా ఇంకా కుతకుతలాడుతూనే ఉంది. పెలోసీ పర్యటన ముగియగానే తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలకు ఉపక్రమించిన చైనా.. ఇపుడు అమెరికాపైనా ప్రతీకార చర్యలకు దిగింది. బైడెన్‌ సర్కారుతో వాతావరణ మార్పులు, రక్షణ విభాగం, మాదకద్రవ్య నిరోధక ప్రయత్నాల వంటి అంశాలపై చర్చలను నిలిపివేస్తున్నట్లు బీజింగ్‌ నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. సైనిక సమన్వయం, సముద్ర భద్రత, అక్రమ వలసదారుల అప్పగింతలో సహకారం, నేర పరిశోధనలు, అంతర్జాతీయ నేరాలు.. ఇలా అన్ని అంశాలపై అమెరికాతో ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకొంటున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తైవాన్‌ పర్యటనకు వచ్చిన నాన్సి పెలోసి (82)తోపాటు ఆమె కుటుంబంపైనా చైనా సందర్శించకుండా ఆంక్షలు విధించింది. తమ సైనిక చర్యలను విమర్శిస్తూ ప్రకటనలు చేసిన జీ7, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల వైఖరిని అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా నిరసిస్తూ బీజింగ్‌లో ఉన్న ఆయా దేశాల దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసినట్లు చైనా వెల్లడించింది.

బీజింగ్‌ సైనిక విన్యాసాలు బాధ్యతా రాహిత్యమని, చైనా అతిగా వ్యవహరిస్తోందని వాషింగ్టన్‌ స్పందించింది. మరోవైపు.. ఆసియా పర్యటన ముగింపులో భాగంగా జపాన్‌ రాజధాని టోక్యోలో ఉన్న పెలోసీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తైవాన్‌ ఏకాకి కాదు. ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా యూఎస్‌ అధికారులను చైనా అడ్డుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. చైనా సైనికచర్య ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు తీవ్ర సమస్యగా పెలోసీతో సమావేశమైన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద అభివర్ణించారు.

ఏషియన్‌ ప్రాంతీయ సదస్సులో పాల్గొనే నిమిత్తం కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తైవాన్‌ లక్ష్యంగా చైనా సైనిక చర్యలు ఉద్దేశపూర్వక చొరబాటు. వారి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్నింటినీ ఆపి బీజింగ్‌ వెనక్కు మళ్లాలి’ అని కోరారు. ‘మిత్రపక్షాల రక్షణ విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు. చివరకు జపాన్‌ ప్రత్యేక ఆర్థికమండలి పరిధిలోనూ క్షిపణులు ప్రయోగించారు. ఇది ప్రమాదకర చర్య’ అని తెలిపారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో.. దీర్ఘకాలంగా తాము ఎదురుచూస్తున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.  

కాంబోడియా సదస్సులో ఎడమొహం పెడమొహం

నాంఫెన్‌లో ఏషియన్‌ ప్రాంతీయ సదస్సు శుక్రవారం ప్రారంభం కాగానే లోనికి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అక్కడున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ను భుజంపై తట్టి పలకరించారు. ఆ తర్వాత లోపలకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వారిద్దరి వైపు చూడకుండానే తన ఆసనం వద్దకు వెళ్లి కూర్చొన్నారు. జపాన్‌ విదేశాంగ మంత్రి హయాషి యోషిమాస మాట్లాడటం ప్రారంభించగానే లావరోవ్‌, వాంగ్‌ ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని