Corona Virus: ఉమ్మితో వేగంగా కరోనా నిర్ధారణ

వాషింగ్టన్‌: ఇంటిలోనే కూర్చుని లాలాజలాన్ని పరీక్షించుకోవడం ద్వారా కొవిడ్‌-19 సోకిందో లేదో 45 నిమిషాల్లోనే గుర్తించే పద్ధతిని అమెరికా పరిశోధకులు కనిపెట్టారు. ఇది పీసీఆర్‌ పరీక్షకు దీటుగా ఫలితాలనిస్తోందని వారు చెప్పారు. కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను కచ్చితంగా కనిపెట్టడానికి ఇంతవరకు పీసీఆర్‌ పరీక్షే ప్రామాణికం. కానీ, దాని ఫలితం రావడానికి కొన్ని రోజులు పడుతోంది. అప్పటివరకూ ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచకతప్పదు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షను సులభంగా చేయవచ్చు కానీ, దాని ఫలితం పీసీఆర్‌ అంత కచ్చితంగా ఉండదు. లాలాజల పరీక్ష సౌలభ్యం, కచ్చితత్వం రెండింటినీ ఇస్తుందని తాజా పరిశోధనలో పాల్గొన్న వెయిహువా గ్వాన్‌ చెప్పారు. ఈ బృందం రూపొందించిన పరీక్ష కిట్‌ అరచేతిలో పడుతుంది. గొట్టం వంటి సాధనంలో ఉమ్మివేసి కిట్‌లో పెట్టాలి. ఆ పరికరం లాలాజలాన్ని 95 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడిచేస్తుంది. ఆ ఉష్ణోగ్రత వద్ద వైరస్‌ పైపొర కరిగిపోయి దానిలోని జన్యు పదార్థం బయటపడుతుంది. గొట్టం లాంటి సాధనంలో ముందే ఉంచిన రీఏజెంట్లతో ఆ జన్యు పదార్థం కలుస్తుంది. తరవాత లాలాజల ఉష్ణోగ్రతను 65 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించినప్పుడు వైరల్‌ జన్యు రేణువులు కోట్లాదిగా వృద్ధి అవుతాయి. దాంతో వైరస్‌ ఉనికిని కనిపెట్టడం సులువు అవుతుంది. లాలాజలంలో కరోనా వైరస్‌ ఉందో లేదో నిర్ధారించే సమాచారం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌కు చేరిపోతుంది. వందలాది నమూనాలను పరీక్షించి లాలాజల పరీక్ష సామర్థ్యాన్ని నిర్ధారించామని పరిశోధకులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts