మహిళను దూషించిన కేసులో నిందితుల అరెస్టు

శ్రీకాంత్‌ త్యాగితోపాటు మరో ముగ్గురు.. 

ఈనాడు, లఖ్‌నవూ: నోయిడాలోని సెక్టార్‌-93లో గ్రాండ్‌ ఒమాక్స్‌ రెసిడెన్షియల్‌ సొసైటీకి చెందిన ఒక మహిళను పరుష పదజాలంతో దూషించిన కేసులో అదే సొసైటీలో నివాసం ఉంటున్న రాజకీయ నాయకుడు శ్రీకాంత్‌ త్యాగిని పోలీసులు మేరఠ్‌లో అరెస్టు చేశారు. నిందితుడు తన ఇంటి చుట్టూ అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా సొసైటీ అనుమతి లేకుండా తన ఇంటి ముందు మొక్కలు నాటారు. దీనిపై ప్రశ్నించిన మహిళను దూషించడంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మేరఠ్‌లో శ్రీకాంత్‌ త్యాగితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తాను భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడినని పరారవడానికి ముందువరకు త్యాగి చెప్పుకోవడం రాజకీయంగా దుమారం రేపింది. భాజపా దీన్ని ఖండించింది. నిందితుడికి పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొంది. ప్రతిపక్షాలు ఈ విషయంలో భాజపాపై విమర్శల దాడిచేశాయి. భాజపా సీనియర్‌ నాయకులతో శ్రీకాంత్‌ త్యాగి కలిసిఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశాయి. నిందితుడి అరెస్టు అనంతరం ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్‌ మౌర్య వారణాసిలో మీడియాతో మాట్లాడారు. నేరం చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందినా సరే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టబద్ధమైన పాలన ఉందని, చట్టం ఎవరికైనా ఒకేలా ఉంటుందని స్పష్టంచేశారు.


మరిన్ని