మానవ అక్రమ రవాణాపై అవగాహనకు సమావేశాలు నిర్వహించండి

హైకోర్టులను కోరిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: ప్రపంచీకరణ యుగంలో నానాటికీ పెరుగుతున్న మానవ అక్రమ రవాణా గురించి న్యాయాధికారులలో అవగాహన పెంచి, సమర్థమైన చర్యలు తీసుకోవడానికి రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని హైకోర్టులను కేంద్ర హోం శాఖ కోరింది. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు, సంబంధిత ఇతర సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమీక్షా సమావేశాల నిర్వహణకు రూ.2 లక్షలు అందిస్తామని తెలిపింది. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన లోపించడం వల్ల సకాలంలో సక్రమంగా కేసులు నమోదు చేయడం లేదని, ఈ నేరాలను ఎలా ఎదుర్కోవాలనే దాని మీద న్యాయాధికారులకు శిక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేసింది. దీని వల్ల అక్రమ రవాణా నిరోధానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని హోం శాఖ తెలిపింది. ప్రపంచీకరణ యుగంలో మెరుగైన అవకాశాల కోసం జనం ఇతర దేశాలకు వలస పోవడం ఎక్కువైంది. సరైన పత్రాలు లేకుండా వలస పోయేవారు అక్రమ రవాణాదారుల చేతుల్లో పడుతున్నారు. ఆ దుష్ట శక్తులు వీరిని వెట్టి చాకిరీ, వ్యభిచారం, బలవంతపు వివాహాలు, ఇళ్లలో బండ చాకిరీ, భిక్షాటన, అవయవ చౌర్యం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా నేరాల్లోకి దించుతున్నాయి. శారీరక, లైంగిక హింస, వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్రాల మధ్యనే కాకుండా, పొరుగు దేశాలతోనూ సమన్వయ సహకారాలు నెరపాలని కేంద్ర హోం శాఖ అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు రాసిన లేఖలో పేర్కొంది. మానవ అక్రమ రవాణా గురించి పోలీసు, న్యాయాధికారులు, సరిహద్దు భద్రతా సిబ్బందికి పూర్తి విషయ పరిజ్ఞానం అందించాలని, పౌర సంఘాల సహకారమూ తీసుకోవాలని సూచించింది. దీనికోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరింది.


మరిన్ని

ap-districts
ts-districts