తీరు మారని చైనా

అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌పై ఉగ్రముద్ర పడకుండా మోకాలడ్డు
భద్రతామండలిలో భారత్‌, అమెరికా ప్రతిపాదన నిలుపుదల

ఐరాస, దిల్లీ: ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్థాన్‌కు చెందిన జైష్‌-ఎ-మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రసంస్థ ఉప అధినేత అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనకు భద్రతామండలిలో మోకాలడ్డింది. అబ్దుల్‌ రవూఫ్‌.. జేఈఎం అధినేత మసూద్‌ అజహర్‌ సోదరుడు. భారత్‌ లక్ష్యంగా అతడు గతంలో పలు విధ్వంసాలకు కుట్ర పన్ని అమలు చేశాడు. అమెరికా 2010లోనే అతడిపై నిషేధాజ్ఞలు విధించింది. అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి.. ప్రయాణాలు జరపకుండా అడ్డుకోవాలని, అతడి ఆస్తులను స్తంభింపజేయాలని భద్రతామండలిలో భారత్‌, అమెరికా ప్రతిపాదించాయి. దాన్ని చైనా బుధవారం తన అధికారాలతో సాంకేతికంగా నిలుపుదలలో ఉంచింది. భద్రతామండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా.. చైనా మినహా అన్ని దేశాలు భారత్‌, అమెరికాల ప్రతిపాదనకు మద్దతు పలకడం గమనార్హం. ఉగ్రవాదులపై నిషేధాజ్ఞల విషయంలో ఆ దేశం అడ్డుపుల్లలు వేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఈ ఏడాది జూన్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉప అధినేత అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీపై ఆంక్షల కోసం భారత్‌, అమెరికా చేసిన ప్రతిపాదన ఆమోదం పొందకుండా ఇదే తరహాలో వాయిదాకు కారణమైంది.

భారత్‌లో పలు భీకర ఉగ్ర దాడుల వెనక అబ్దుల్‌ రవూఫ్‌ సూత్రధారిగా ఉన్నాడు. కొన్ని విధ్వంసాల అమలులోనూ పాలుపంచుకున్నాడు. 1999లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌, భారత పార్లమెంటుపై దాడి (2001), అయోధ్యలో తాత్కాలిక రామాలయంపై దాడి (2005), పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి (2016) వంటి కుట్రల్లో అతడికి ప్రమేయం ఉంది.

మాకు సమయం కావాలి: చైనా

అబ్దుల్‌ రవూఫ్‌పై ఆంక్షల ప్రతిపాదనను అడ్డుకోవడాన్ని చైనా సమర్థించుకుంది. ఐరాస ఆంక్షల కమిటీ నియమ నిబంధనలను తాము తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ చెప్పారు. భారత్‌, అమెరికాల ప్రతిపాదనను విశ్లేషించి నిర్ణయం తీసుకునేందుకు తమకు మరింత సమయం కావాలని పేర్కొన్నారు.

రాజకీయ ప్రేరేపితం: భారత్‌

అబ్దుల్‌ రవూఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రక్రియకు చైనా అడ్డుతగలడాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా భారత ప్రభుత్వ వర్గాలు అభివర్ణించాయి. దాదాపుగా పాకిస్థాన్‌కు చెందిన ప్రతి ఉగ్రవాదిపై ఆంక్షల విషయంలో డ్రాగన్‌ మోకాలడ్డుతుండటాన్ని బట్టి అది స్పష్టంగా తెలిసిపోతోందని పేర్కొన్నాయి. చైనా చర్యలు ఐరాస ఆంక్షల కమిటీల గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని విమర్శించాయి. ఆ దేశ వైఖరిని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఉగ్రవాదంపై పోరులో చైనా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందంటూ మండిపడ్డారు. ఉగ్రవాదంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ నివేదికలో లష్కరే, జేఈఎం వంటి ప్రమాదకర ఉగ్ర సంస్థల ప్రస్తావన లేకపోవడంపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు- అబ్దుల్‌ రవూఫ్‌ వ్యవహారంలో చైనా వైఖరిపై అమెరికా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని