ఈజిప్టు చర్చిలో భారీ అగ్నిప్రమాదం

41 మంది దుర్మరణం

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ చర్చిలో ఉదయం ప్రార్థనలు జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయపడ్డారు. ఇంబాబా ప్రాంతంలోని అబు సెఫిన్‌ చర్చిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో రెండో అంతస్తులోని ఒక ఏసీలో మంటలు మొదలయ్యాయని, క్షణాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయని, దీంతో లోపల ఉన్నవారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రాణభయంతో కొందరు కిందికి దూకారని, ఈ గందరగోళంలో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. చర్చిలోని ఓ భాగంలో పిల్లల డే కేర్‌ సెంటర్‌ను నడుపుతున్నారని, ప్రమాదం జరిగినప్పుడు చర్చిలో పనిచేసే ఓ వ్యక్తి పిల్లల్లో సాధ్యమైనంత మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. వాటిలో చెక్క కుర్చీలు, బల్లలు అగ్నికీలల్లో దహనమవుతుండటం కనిపించింది. మంటలను అదుపు చేయడానికి 15 అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈజిప్టు ప్రధాని మొస్తఫా మడ్బౌలీ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈజిప్టులో ఇటీవలికాలంలో అత్యంత తీవ్రమైన ఈ అగ్నిప్రమాద ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తాహ్‌ ఎల్‌-సిస్సి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోప్టిక్‌ క్రిస్టియన్‌ పోప్‌ టవడ్రోస్‌-2తో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలియజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts