చైనా చర్యలతో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అశాంతి

యూఎస్‌ సెనేట్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి

వాషింగ్టన్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇటీవలి చైనా దుందుడుకు చర్యలు అశాంతిని కలిగిస్తున్నాయని భారత సంతతికి చెందిన అమెరికా సెనేట్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో సుస్థిరతను నెలకొల్పడానికి భారత్‌, అమెరికాలు.. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలతో కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి ఆధ్వర్యంలో తైవాన్‌ సహా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పర్యటించిన బృందంలో రాజా కృష్ణమూర్తి కూడా ఉన్నారు. తాజాగా ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. భారత్‌ శక్తిమంతమైన దేశంగా ఎదిగిన తీరు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అది పోషిస్తున్న పాత్రపై తమ పర్యటనలో ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు ఆయన చెప్పారు. పెలోసి బృందం జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, తైవాన్‌లలో పర్యటించింది. చైనా దుందుడుకు చర్యలపై ఆ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయని రాజా కృష్ణమూర్తి చెప్పారు. నియమాల ఆధారిత అంతర్జాతీయ శాంతి భద్రతలకు భారత్‌తో భాగస్వామ్యం కొనసాగించడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, భారత్‌ లాంటి దేశాలు లక్ష్యంగా చైనా సైనిక మోహరింపులు చేపట్టినప్పుడు.. పొరుగు దేశాలు ఆందోళన చెందుతాయని, అమెరికా నుంచి మరింత ఎక్కువగా భద్రతపరమైన సాయాన్ని కోరుకుంటాయని చెప్పారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాలు తీవ్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు. చైనాలో కొవిడ్‌ అనంతరం ఆర్థిక పురోగతి మందగించిందని, దీంతోపాటు ఇతర అంతర్గత సమస్యలతో ఆ దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌పై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిందని, దాన్నుంచి దృష్టి మళ్లించడానికి మరింతగా పొరుగు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. ఏదో రోజు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని అన్ని దేశాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలసికట్టుగా సవాళ్లను ఎదుర్కొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts