Coronavirus: క్షయ టీకా దెబ్బకు కొవిడ్‌ పరార్‌.. అమెరికా పరిశోధకుల అధ్యయనం

బోస్టన్‌: క్షయవ్యాధి నివారణకు వాడే బీసీజీ టీకాను పలు మోతాదుల్లో టైప్‌-1 మధుమేహులకు ఇస్తే.. వారికి కొవిడ్‌-19 నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి పరిశోధకుల సుదీర్ఘ అధ్యయనం నిర్ధరించింది. ప్రస్తుతం వాడుతున్న యాంటీజెన్‌ ఆధారిత టీకాలు కొవిడ్‌-19 నివారణకే పరిమితం. బీసీజీ టీకా కొవిడ్‌తోపాటు ఇతర వైరస్‌లు, అంటువ్యాధులను కూడా అడ్డుకొంటుందని పరిశోధకులు తెలిపారు. 2020 నుంచి కొవిడ్‌ కేసులు విజృంభించగా, అంతకుముందు నుంచే 144 మంది టైప్‌-1 మధుమేహులపై బీసీజీ ఎలా పనిచేస్తుందన్న అంశంపైన పరిశోధన జరిగింది.  పరిశోధనలో పాల్గొన్న 144 మందిలో 96 మందికి బీసీజీ టీకా ఇచ్చి, 48 మందికి ఉత్తుత్తి మందు (ప్లాసిబో) ఇచ్చారు. ప్లాసిబో తీసుకున్నవారిలో 12.5 శాతం మందికి కొవిడ్‌-19 సోకగా, బీసీజీ టీకా తీసుకున్నవారిలో ఒక శాతానికి మాత్రమే కొవిడ్‌ వైరస్‌ సోకింది. అంటే.. బీసీజీ టీకా కొవిడ్‌పై 92 శాతం సామర్థ్యం చూపిందని తేల్చారు. టైప్‌-1 మధుమేహులకు కొవిడ్‌ సోకితే చాలా ప్రమాదం. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తమ పరిశోధనలో పాల్గొన్న టైప్‌-1 మధుమేహులకు కొవిడ్‌ విరుచుకుపడటానికి ముందు మూడు బీసీజీ డోసులు ఇచ్చామనీ, అవి వారికి రక్షణకవచంగా నిలిచాయని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి పరిశోధకుడు డెనిస్‌ ఫౌస్ట్‌మన్‌ వివరించారు. బీసీజీ టీకా ఆలస్యంగా పనిచేసినా, దీర్ఘకాలం రక్షణ ఇస్తుందని చెప్పారు. దీనివల్ల ప్రతికూల ఫలితాలేమీ లేవు. ఇది కొవిడ్‌ కొత్త రూపాల మీద కూడా పనిచేయవచ్చు. చాలా చౌకగా దొరికే బీసీజీ టీకాను ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మంది బాలలకు ఇస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని