హంబన్‌టోటకు చేరిన చైనా నిఘా నౌక

కొలంబో: భారత్‌, శ్రీలంక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్న పరిణామమొకటి తాజాగా చోటుచేసుకుంది. మన దేశంతో పాటు అమెరికా వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అత్యాధునిక నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’ లంకలోని హంబన్‌టోట ఓడరేవుకు మంగళవారం ఉదయం చేరుకుంది. ఈ నెల 22 వరకు అది అక్కడే మకాం వేయనుంది. ‘యువాన్‌ వాంగ్‌ 5’పై రెండు వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. 750 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై సైతం గగనతల నిఘా ఉంచగల సామర్థ్యం దాని సొంతం. ప్రధానంగా ఉపగ్రహాలు, బాలిస్టిక్‌ క్షిపణుల కదలికలను అది పసిగట్టగలదు. ఈ నెల 11నే ఆ నౌకను హంబన్‌టోటకు చేర్చాలని.. అక్కడ కొన్ని రోజులు ఉంచాలని చైనా భావించింది. ఇంధనాన్ని నింపుకోవడం సహా మరికొన్ని సాధారణ కార్యకలాపాల కోసమే ఆ ఓడరేవుకు తరలిస్తున్నట్లు పేర్కొంది. అందుకు భారత్‌, అమెరికాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అత్యాధునిక నిఘా వ్యవస్థలతో కూడిన నౌక హంబన్‌టోటకు వెళ్లే దారిలో.. తమ రక్షణ వ్యవస్థలపై నిఘా వేసే ముప్పుందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts