Rajasthan: నా బుజ్జి ఎలుకను దొంగిలించారు సార్‌.. పోలీసులకు వింత ఫిర్యాదు

బాంసవాఢా: ‘సార్‌.. నా సైకిల్‌ పోయింది. సార్‌ నా కారు పోయింది లేదా మా ఇంట్లో బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు’ అంటూ పోలీసులకు ఫిర్యాదులు అందడం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా.. ‘సార్‌ నేను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఎలుకను ఎవరో ఎత్తుకెళ్లారు’ అని పేర్కొంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. ఈ మేరకు బాంసవాఢా జిల్లా సజ్జన్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం  ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్య పోవడం పోలీసుల వంతైంది. అనంతరం అతనికి నచ్చజెప్పేందుకు వారు విఫలయత్నం చేశారు. తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని, గత నెల 28న దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదుదారుడు పేర్కొనడం విశేషం. అక్కడితో ఆగకుండా తన సోదరుడి ముగ్గురు కుమారులపై అనుమానం ఉందని సైతం వెల్లడించాడు. చివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురి పేర్లను అందులో నిందితులుగా పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారని చెబుతున్నారు.


మరిన్ని