ఉక్రెయిన్‌ ముందుకు.. రష్యా వెనక్కి

 ‘లీమన్‌’ మా అధీనం: జెలెన్‌స్కీ

 ఆత్మాహుతి డ్రోన్లతో మాస్కో దాడులు

కీవ్‌: ఉక్రెయిన్‌ భూభాగాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నామని ఘనంగా ప్రకటించిన రష్యా, ఇప్పుడు ఆ ప్రాంతాలను నిలుపుకోలేక అష్టకష్టాలు పడుతోంది. దొనెట్స్క్‌ ప్రాంతంలోని లీమన్‌ను పూర్తిగా ఉక్రెయిన్‌ దళాల వశం చేసుకున్నాయి. అక్కడ రష్యా పతాకాన్ని తొలగించి తమ జెండాను ఎగరవేశాయి. డాన్‌బాస్‌లోని చాలా ప్రాంతాల్లో ముందుకు దూసుకుపోతున్నాయి. లీమన్‌ నగరం పూర్తిగా తమ అధీనమైందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరోవైపు అధ్యక్షుడు స్వగ్రామం, ఇతర ప్రాంతాలపై రష్యా ఆత్మాహుతి డ్రోన్లతో ఆదివారం దాడులు చేసింది. లీమన్‌ చేజారడం.. రాజకీయంగా మాస్కోకు అతి పెద్ద ఎదురుదెబ్బ అని బ్రిటన్‌ సైన్యం పేర్కొంది. సంఘర్షణను ఆపేయాలని, సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పోప్‌ ప్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. అణుదాడులకు సైతం వెనుకాడబోమన్న మాస్కో బెదిరింపుల నేపథ్యంలో ఈ హింస, మరణాల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి  చేశారు. అంతర్జాతీయ సమాజం కూడా ఇందుకు చొరవ చూపాలని అన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts