54కు చేరిన ఇయన్‌ మృతులు

ఫ్లోరిడాలో పర్యటించనున్న  అమెరికా అధ్యక్షుడు

ఫోర్ట్‌ మైయర్స్‌: ఇయాన్‌ హరికేన్‌ విధ్వంసంతో మరణించినవారి సంఖ్య 54కు చేరింది. ఇందులో ఒక్క ఫ్లోరిడాలోనే 47 మంది మృతి చెందగా, నార్త్‌ కరోలినాలో నలుగురు, క్యూబాలో ముగ్గురు మరణించినట్లుగా తేలింది. మరోపక్క హరికేన్‌ ప్రభావిత ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన భార్య జిల్‌ బైడెన్‌ బుధవారం పర్యటించే అవకాశం ఉంది. అమెరికాలోని నైరుతి తీరప్రాంతంలో కరోలినాస్‌ వరకూ ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం పునరుద్ధరించకపోవడంతో లక్షలాది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఉదయం వరకూ ఏడు లక్షల గృహాలు, వ్యాపార కార్యాలయాలు అంధకారంలోనే ఉన్నాయి. వరదనీటితో నిండిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలతో అవరోధ ద్వీపాలలో అనేకమంది చిక్కుకుపోయారు. వీరిలో పలువురిని సహాయకబృందాలు పునరావాస కేంద్రాలకు తరలించాయి. అనేక మంది పౌరులు అతితక్కువగా ఉన్న సెల్‌ఫోన్‌ సేవలు, నీళ్లు, కరెంటు లేక సతమతమవుతున్నారు. కొంతమేర సమాచార వ్యవస్థ పునరుద్ధరణకు 120 స్టార్‌లింక్‌ శాటిలైట్ల సేవలను బిలియనీరు ఎలన్‌ మస్క్‌ అందిస్తున్నారని ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాన్‌టిస్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని