స్వీడన్‌ శాస్త్రవేత్తకు వైద్యశాస్త్రంలో ‘నోబెల్‌’

మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు పురస్కారం

స్టాక్‌హోం: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)ను నోబెల్‌ పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన ఆవిష్కరణలకు ఈ అవార్డును అందిస్తున్నట్లు నోబెల్‌ అవార్డు ప్యానెల్‌ సోమవారం ప్రకటించింది. వైద్య రంగంలో అవార్డు గ్రహీత పేరు ప్రకటనతో ఈ ఏడాది నోబెల్‌ సందడి మొదలైనట్లైంది. పాబో చేసిన పరిశోధనలతో మానవ రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతరించిపోయిన పూర్వ మానవ జాతీయులతో పోలిస్తే ప్రస్తుత మానవులను ప్రత్యేకంగా నిలబెడుతున్న కారణాలు వెల్లడయ్యాయి. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్‌, డెనిసోవాన్స్‌ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 19వ శతాబ్దం మధ్యలో డీఎన్‌ఏ పరిశోధనల ద్వారా నియాండెర్తల్స్‌ ఎముకలను తొలిసారి గుర్తించారు. తద్వారా శాస్త్రవేత్తలు జాతుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోగలిగారు.

తండ్రి బెర్జ్‌స్ట్రామ్‌ కూడా నోబెల్‌ విజేతే

జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిక్‌లోనూ, లిప్జిగ్‌లోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీలో పాబో చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ఈ ప్రఖ్యాత పురస్కారం దక్కింది. పాబో తండ్రి సును బెర్జ్‌స్ట్రామ్‌ 1982లో వైద్యరంగంలో నోబెల్‌ పురస్కారాన్ని పొందారు. తండ్రి, కుమారులకు ఒకే రంగంలో ఈ అవార్డులు దక్కడం విశేషం. తండ్రి- కుమారుడు/కుమార్తె నోబెల్‌ను సాధించడం ఇది ఎనిమిదోసారి.

నేడు భౌతికశాస్త్రంలో..

మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్‌ 10న ఆర్థిక రంగంలో నోబెల్‌ గ్రహీత పేరును వెల్లడిస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.


మరిన్ని