పచ్చదనంతోనే ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట

బీజింగ్‌: వాతావరణ మార్పులు, పట్టణీకరణ విజృంభణ వల్ల నగరాల ఉష్ణోగ్రత దశాబ్దానికి సగటున 0.5 సెల్సియస్‌ డిగ్రీ చొప్పున పెరుగుతోందని, పరిసర గ్రామాలకన్నా నగరాలు 29% వేగంగా వేడెక్కుతున్నాయని చైనాలోని నాంజింగ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. పట్టణాలు నానాటికీ ఉష్ణద్వీపాలుగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌, చైనాల్లోని నగరాల్లో ఉపరితల ఉష్ణోగ్రత దశాబ్దానికి 0.23 సెల్సియస్‌ డిగ్రీల చొప్పున పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో విరివిగా చెట్లను పెంచితే ఉపరితల ఉష్ణోగ్రత దశాబ్దానికి 0.13 సెల్సియస్‌ డిగ్రీల చొప్పున తగ్గుతుందని ఐరోపా నగరాల అనుభవం సూచిస్తోంది. అమెరికాలోని షికాగోలో వనాల విస్తీర్ణాన్ని వేగంగా పెంచగా సగటు ఉపరితల ఉష్ణోగ్రత దశాబ్ద కాలంలో అదనంగా 0.084 సెల్సియస్‌ డిగ్రీల మేర తగ్గింది. నాంజింగ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు 2002-2021 మధ్య 2 వేలకుపైగా నగరాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలపై ఉపగ్రహాలు అందించిన సమాచారాన్ని విశ్లేషించారు. వాటిని సమీపంలోని గ్రామీణ ప్రాంతాల ఉష్ణోగ్రతలతో పోల్చిచూశారు. నైజీరియాలోని అబూజియా, అమెరికాలోని ఫినిక్స్‌, బ్రిటన్‌లో లండన్‌, బ్రెజిల్‌లో సావోపాలో, రష్యాలో మాస్కో వంటి మెగా నగరాల ఉష్ణోగ్రతలనూ పరిగణనలోకి తీసుకున్నారు. నగరాల్లో పచ్చదనం ఎంత త్వరగా పెరిగితే ఉష్ణోగ్రతలను అంత వేగంగా తగ్గించవచ్చని పరిశోధకులు సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts