వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో నాలుగు ప్రత్యేక ధర్మాసనాలు

సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: అత్యధిక కేసులు ఉన్న నాలుగు అంశాల వేగవంత విచారణ కోసం వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో నాలుగు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ బుధవారం ప్రకటించారు. ఈ ధర్మాసనాలు.. 1. క్రిమినల్‌ అప్పీళ్లు, 2. భూసేకరణ అంశాలు, 3. వాహన ప్రమాద క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ కేసులు, 4.ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కేసులను విచారించనున్నట్లు సీజేఐ వెల్లడించారు. భూసేకరణ అంశాలకు సంబంధించిన ధర్మాసనానికి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిపారు. ధర్మాసనాల్లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది. ఓ కేసుకు సంబంధించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజేఐ స్పందిస్తూ ఈ ధర్మాసనాల ఏర్పాటు గురించి వెల్లడించారు.

28 నుంచి ప్రతి బెంచ్‌ ముందు పదేసి ట్రాన్స్‌ఫర్‌, బెయిల్‌ పిటిషన్లు

ఈ నెల 28 నుంచి సుప్రీంకోర్టులోని అన్ని ధర్మాసనాల ముందూ ప్రతిరోజూ 10 ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్లు (నోటీసులు జారీ చేసినవి), 10 బెయిల్‌ పిటిషన్ల విచారణ చేపట్టనున్నారు. తొలుత ఈ 20 కేసులను విచారించిన తర్వాతే ధర్మాసనాలు మిగతా కేసులకు వెళ్లనున్నాయి. అలాగే ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో 7 కొత్త కేసులనూ లిస్ట్‌ చేస్తారు. తుది దశకు వచ్చిన కేసుల విచారణ బుధ, గురువారాల్లో జరుగుతుంది. మంగళవారం ఇలాంటి కేసులను లిస్ట్‌ చేయరు. కొత్తగా ఏదైనా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసినప్పుడు అందులోని లోపాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పిన 28 రోజుల్లోపు సరిదిద్ది దాఖలు చేయాల్సి ఉంటుంది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు