సంక్షిప్త వార్తలు(6)

మార్కెట్‌లోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం

ఇంటర్నెట్‌డెస్క్‌: రక్తానికి సంబంధించి ‘హిమోఫిలియా బి’ అనే ఆరోగ్య సమస్యకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. ఆస్ట్రేలియాలోని దీని తయారీ సంస్థ ‘సీఎస్‌ఎల్‌ లిమిటెడ్‌’ ఔషధ ధరను 35 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో రూ.28.6 కోట్లు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చికిత్సగా నిలిచింది. రక్తం గడ్డకట్టడంలో సమస్యలతో కూడిన అరుదైన లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇది. ప్రతి 40 వేల మందిలో ఒకరు ఇటువంటి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్‌-9 అనే ప్రొటీన్‌లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం పలు సంస్థల నుంచి అందుబాటులో ఉన్న చికిత్సలతో పోలిస్తే సీఎస్‌ఎల్‌ అందుబాటులోకి తెచ్చిన చికిత్స దీర్ఘకాలం ప్రభావవంతంగా ఉంటుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్‌ ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుంది. అప్పుడు కాలేయం నుంచి ఫ్యాక్టర్‌-9 విడుదలవుతుంది.


తుర్కియేలో భూకంపం

అంకారా: వాయవ్య తుర్కియేలోని గొల్కాయా పట్టణంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించింది. 5.9 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. గాఢనిద్ర నుంచి తేరుకుని ఒక్కసారిగా ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే ప్రయత్నంలో 68 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది బాల్కనీలు, కిటికీల నుంచి దూకినవారే. అనేక భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇస్తాంబుల్‌, అంకారా తదితర నగరాల్లోనూ పలుమార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటి 4.3 తీవ్రతను నమోదు చేసింది. భవనాలు దెబ్బతిన్నా అదృష్టవశాత్తూ తీవ్రస్థాయి నష్టమేమీ వాటిల్లలేదని దేశాధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌ చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల్ని మూసివేశారు.


వీటిని తింటే జ్ఞాపకశక్తి పదిలం

వాషింగ్టన్‌: పండ్లు, కాయగూరలు, టీ, వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్‌ ఫ్లేవనాల్స్‌... జ్ఞాపకశక్తి క్షీణతను అడ్డుకుంటున్నట్టు రష్‌ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఫ్లేవనాల్స్‌ అనేవి మొక్కల్లో రంగులకు కారణమయ్యే పదార్థాల్లోని ఆరోగ్యదాయక ఫ్లేవనాయిడ్‌ కోవకు చెందినవే. లింగ భేదం, వయసు పెరగడం, పొగ తాగడం వంటి కారణాల రీత్యా మనుషుల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. ఇతరులతో పోల్చితే, ఫ్లేవనాల్స్‌ అధికంగా ఉండే పండ్లు, కాయగూరలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల చాలా నెమ్మదిగా ఉంటున్నట్టు పరిశోధనకర్త థామస్‌ హోలండ్‌ వెల్లడించారు. ఫ్లేవనాల్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే ఇందుకు కారణంగా నిర్ధారణకు వచ్చినట్టు ఆయన వివరించారు.


ఉక్రెయిన్‌ కోసం మరో 450 కోట్ల డాలర్లు

యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ కోసం మరో 450 కోట్ల డాలర్లను సమీకరించాం. ఈ నిధులను అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఉదారంగా అందించింది. బలహీన వర్గాలకు సామాజిక రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, వృద్ధులకు పింఛన్లు తదితర ముఖ్యమైన సేవలను కొనసాగించేందుకు వీటిని వినియోగిస్తాం.

- ప్రపంచ బ్యాంకు


తరాల మధ్య అంతరాలు తొలగాలి

పాత, కొత్త తరాల మధ్య ఓ కనిపించని అగాధం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది సామాజిక పురోగతికి అడ్డంకిగా నిలుస్తోంది. పెద్దలు సముపార్జించిన అనుభవం, జ్ఞానానికి యువతలోని ఉత్సాహం, సృజనాత్మకత తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. అందుకు రెండు తరాల మధ్య ఎలాంటి అంతరాలకు చోటు లేకుండా సంభాషణలు, చర్చలు జరిగే వాతావరణాన్ని నెలకొల్పాలి.

- గౌర్‌ గోపాల్‌ దాస్‌


ఆ దేశాలు హక్కుల గురించి మాట్లాడొద్దు

ఇతర దేశాలకు ఆయుధాలు విక్రయించడం ద్వారా రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న దేశాలు మానవ హక్కుల గురించి మాట్లాడకూడదు. మహిళలు, పిల్లలను చంపడం తప్ప ఆయుధాల ద్వారా సాధించేదేమిటి? ఆయుధాల విక్రయాల ద్వారా పొందుతున్న ఆదాయాన్ని పశ్చిమ దేశాలు వెల్లడించగలవా?

- శేఖర్‌ కపూర్‌


జెరూసలెంలో జంట పేలుళ్లు
యువకుడి మృతి, 18 మందికి గాయాలు

జెరూసలెం: ఇజ్రాయెల్‌ రాజధాని జెరూసలెంలో బుధవారం జంట పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ పేలుళ్లలో ఓ యువకుడు దుర్మరణం పాలవ్వగా, మరో 18 మంది గాయపడ్డారు. మృతుణ్ని అర్యేహ్‌ షెచొపెక్‌గా గుర్తించారు. అతడికి ఇజ్రాయెల్‌తో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. జెరూసలెంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో.. జన సంచారం ఎక్కువగా ఉండే బస్టాపులకు సమీపంలో తాజా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పాలస్తీనియన్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఇజ్రాయెల్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


అఫ్గాన్‌లో 12 మందికి కొరడా దెబ్బలు

ఇస్లామాబాద్‌: మూడు దశాబ్దాల కిందటి తమ పాలనలోని క్రూరమైన శిక్షలను అఫ్గానిస్థాన్‌లోని మత తీవ్రవాద సమూహం తిరిగి ప్రారంభిస్తోంది. బుధవారం ఉదయం లోగార్‌ ప్రావిన్సులోని పుల్‌ ఏ ఆలం నగరంలో స్థానిక క్రీడా స్టేడియం దీనికి వేదికైంది. చుట్టూ గుమికూడిన వందలాది జనం చూస్తుండగా ముగ్గురు మహిళలు, 9 మంది పురుషులకు కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. ఒక్కొక్కరిని 21 నుంచి 39 కొరడా దెబ్బలతో శిక్షించారు. స్థానిక కోర్టు వీరు దొంగతనం, వ్యభిచారాలకు పాల్పడినట్లు నిర్ధారించినట్లు ఓ అధికారి వెల్లడించారు.మరిన్ని