అభిప్రాయ సేకరణకు బ్రిటన్‌ పార్లమెంటు అనుమతి తప్పనిసరి

విడిపోవడంపై స్కాట్లాండ్‌కు స్పష్టంచేసిన సుప్రీంకోర్టు

లండన్‌: బ్రిటన్‌ సుప్రీంకోర్టులో స్కాట్లాండ్‌ బుధవారం అత్యంత కీలకమైన న్యాయ పోరాటాన్ని ఓడిపోయింది. బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదం లేకుండా ఆ దేశం నుంచి విడిపోయే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేయలేరని స్పష్టంచేసింది. ఇదే విషయమై 2014లో అభిప్రాయ సేకరణ నిర్వహించగా 55% మంది ప్రజలు బ్రిటన్‌తోనే ఉండాలని కోరుకున్నారు. బ్రెగ్జిట్‌పై జరిగిన ఓటింగ్‌లోనూ బ్రిటన్‌కు భిన్నంగా స్కాట్లాండ్‌ ప్రజలు తాము ఐరోపా యూనియన్‌ (ఈయూ)తో కలిసి ఉండాలని కోరుకున్నారు. దాంతో బ్రిటన్‌తో కలిసి ఉండటంపై వచ్చే ఏడాది అక్టోబరు 19న మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టాలని స్కాట్లాండ్‌ ప్రధాని నికోలా స్టర్‌జన్‌ ప్రతిపాదించారు. దీనిపై కోర్టులో వాదనల అనంతరం... చట్టబద్ధమైన అభిప్రాయ సేకరణ స్కాట్లాండ్‌, బ్రిటన్‌లలో కీలక రాజకీయ పరిణామాలకు దారి తీయవచ్చని తామిచ్చిన ఏకగ్రీవ తీర్పును సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్‌ రాబర్ట్‌ రీడ్‌ చదివి వినిపించారు. ఈ తీర్పుపై స్కాటిష్‌ నేషనల్‌ పార్టీకి చెందిన ప్రధాని స్టర్‌జన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తాము ఇదే అంశంపై పోటీ చేస్తామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు