నిపుణులైన ఉద్యోగులనందించే తొలి 50 విద్యాలయాల్లో ఐఐటీ-దిల్లీ

టాప్‌ 250లో ఏడు మన దేశానివి

దిల్లీ: అత్యుత్తమ నిపుణులైన గ్రాడ్యుయేట్‌ ఉద్యోగులను అందించే ప్రపంచ విశ్వవిద్యాలయాల(గ్లోబల్‌ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ) ర్యాంకింగ్‌లలో తొలి 50 స్థానాల్లో మన దేశం నుంచి ‘ఐఐటీ-దిల్లీ’కి మాత్రమే చోటు దక్కింది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టీహెచ్‌ఈ) బుధవారం అగ్రశ్రేణి 250 విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(58), ఐఐటీ-బాంబే(72), ఐఐఎం-అహ్మదాబాద్‌ (154), ఐఐటీ-ఖరగ్‌పుర్‌(175), అమిటీ యూనివర్సిటీ(225), నొయిడా అండ్‌ బెంగళూరు యూనివర్సిటీ(242)లు ఈ జాబితాలో స్థానాన్ని పొందాయి. ఐఐటీ-దిల్లీ మినహా ఈ జాబితాలో ఉన్న మన దేశ విశ్వవిద్యాలయాలన్నీ గతంలో కన్నా తమ ర్యాంకులను బాగా మెరుగుపరచుకున్నాయి. అమెరికా విశ్వవిద్యాలయాలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. మొదటి మూడు ర్యాంకులను ఆ దేశానికి చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ దక్కించుకున్నాయి. టాప్‌ 250 విశ్వవిద్యాలయాల్లో... అమెరికాకు చెందినవే 55 ఉన్నాయి. ఫ్రాన్స్‌-18, బ్రిటన్‌-14 విశ్వవిద్యాలయాలతో సంఖ్యాపరంగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్‌ 250 విశ్వవిద్యాలయాల జాబితాలో మొత్తం 44 దేశాలకు చోటు దక్కింది. 7 విద్యాసంస్థలతో మన దేశం 13వ స్థానంలో ఉంది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు