విద్యుత్తు టారిఫ్‌ నియమాలు రూపొందించండి

రాష్ట్రాలకు మూణ్నెల్ల గడువిచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ: విద్యుత్తు టారిఫ్‌ నిర్ణయానికి సెక్షన్‌ 181 కింద నియమ నిబంధనలను రూపొందించాలంటూ అన్ని రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లకు సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మూణ్నెల్లలోపు వీటిని సమర్పించాలని గడువు విధించింది. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు విద్యుత్తు ప్రసార లైసెన్సు మంజూరును సమర్థించిన అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ తీర్పునకు వ్యతిరేకంగా టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ ట్రాన్స్‌మిషన్‌ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. నియమ నిబంధనల ఖరారులో సెక్షన్‌ 61 నియమాలు.. జాతీయ విద్యుత్తు విధానం (ఎన్‌ఈపీ), జాతీయ టారిఫ్‌ విధానం - 2006లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అదానీ గ్రూపునకు ఉపశమనం కల్పిస్తూ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ జేబీ పర్దీవాలాల ధర్మాసనం 93 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ ఎలక్ట్రిసిటీ అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. ‘ఈ తీర్పు ముంబయి వాసులకు పెద్ద విజయం. మహానగరంలో పెరుగుతున్న డిమాండును తీర్చడానికి సరసమైన ధరకు అదనంగా వెయ్యి మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు తీసుకురావడానికి ఇక మార్గం సుగమం అవుతుంది. నగరానికి తలమానికమైన ఈ హెచ్‌వీడీసీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం’ అన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts