close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ముప్ఫైల్లో మొటిమలు వస్తాయా?

నాకు ముప్ఫై సంవత్సరాలు. చామనఛాయగా ఉంటా. నా ముఖమంతా చిన్న చిన్న మొటిమల్లా వచ్చాయి. సాధారణంగా టీనేజీలోనే ఈ సమస్య ఉంటుంది కదా... నేను నిద్రపోయేటప్పుడు చెంపల్ని దిండుకి ఆనించి పడుకుంటా. అదేమైనా కారణమా?

- ఓ సోదరి

 

మీది అడల్డ్‌ యాక్నె అయ్యుండొచ్చు... లేదా దిండ్ల తొడుగు అపరిశుభ్రంగా ఉండటం కూడా కారణం కావొచ్చు. మేకప్‌ తీయకుండా, ముఖం శుభ్రం చేసుకోకుండా పడుకోవడం వల్ల దుమ్మూధూళీ, నూనెలు తలగడకు అంటుకుంటాయి. అలానే జుట్టుకి వాడే ఉత్పత్తుల్లోని రసాయనాలు దిండ్లపైకి చేరతాయి. అలాంటివాటిని శుభ్రం చేయకుండా  వాటిపై చెంపల్ని ఆనించి పడుకోవడం వల్ల అవన్నీ చర్మ రంధ్రాల్లో చేరి మూసుకుపోతాయి. దానివల్ల మొటిమలు, యాక్నే, బ్లాక్‌హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ వంటివి వస్తాయి. అందుకే ప్రతి పదిరోజులకోసారి దిండ్ల గలేబుల్ని శుభ్రంగా ఉతకాలి. అలానే పడుకునే ముందు ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. చర్మం, జుట్టుకి సంబంధించిన ఉత్పత్తులను వాడేటప్పుడు యాక్నే ప్రో కానివి వాడాలి. అంటే వాటిమీద ఆయిల్‌ ఫ్రీ, నాన్‌కెమడోజెనిక్‌ అని రాసి ఉండాలి. ఇక, అడల్డ్‌ యాక్నేవల్ల కూడా మొటిమలు కనిపించొచ్చు. ముప్ఫై నుంచి యాభై ఏళ్ల వరకూ మొటిమలు ఎప్పుడైనా రావొచ్చు. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి అందుకు కారణం. ఒత్తిడి వల్ల శరీరంలో యాండ్రోజెన్‌ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. దాంతో యాక్నే వస్తుంది. అలానే తల్లిదండ్రుల్లో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా మీకు రావొచ్చు. కొన్నిరకాల మందులు వాడుతున్నా ఈ పరిస్థితి ఎదురవుతుంది. మీరు చర్మవైద్య నిపుణులను సంప్రదిస్తే పరీక్షించి బెంజాల్‌ పెరాక్సైడ్‌, క్లిండామైసిన్‌, టాపికల్‌ రెటినాయిడ్లు వంటివి సూచిస్తారు. వీటితో పాటు ఓరల్‌ రెటినాయిడ్లు వాడాల్సి ఉంటుంది. కెమికల్‌ పీల్స్‌, శాలిసిలిక్‌ యాసిడ్‌ పీల్స్‌ చేయించుకోవడం వల్ల యాక్నే తగ్గుతుంది. అలానే మైక్రో డెర్మాబ్రేషన్‌, లేజర్‌ వంటి ఆధునిక చికిత్సల వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. ఇంట్లో అయితే కొద్దిగా తేనెలో, చెంచా చొప్పున నిమ్మరసం, వరిపిండి కలిపి ముఖానికి రాసుకోవాలి. అలానే కీరదోస రసం, నిమ్మరసం, కమలాఫలం తొక్కలపొడి కలిపి పూతలా వేసినా మార్పు ఉంటుంది.

- మీ సందేహాలను vasubeauty@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని