close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నా అభిప్రాయం ఎలా చెప్పను?

ఓ ఆసుపత్రిలో కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ వద్ద మీడియా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నా. ప్రముఖ సందర్భాల్లో ఆసుపత్రి నిర్వాహకులు, మా బాస్‌ ఏర్పాటు చేసే సమావేశాలకు నేను కూడా వెళ్లాల్సి వస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మేం ఆలోచిస్తాం. ఆ సందర్భాల్లో నా అభిప్రాయాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు. గతంలో ఒకసారి మా బాస్‌తో ఏకీభవించకుండా నా ఆలోచనల్ని భావోద్వేగంతో చెప్పేశా. ఆ సందర్భం మా మధ్య ఇబ్బందికరంగా మారింది. ఆమెకు వ్యతిరేకంగా అభిప్రాయం  చెప్పినందుకు తరువాత క్షమాపణలు కూడా అడిగా. ఇకపై నా ఆలోచనలను సమావేశాల్లో పంచుకోగలనా... నాకు తెలిసిన విషయాన్ని తరువాత చెబుదామని ఆగితే, సమావేశం అయిపోతోంది. సంస్థకు సంబంధించి మంచి ఫలితాలు వచ్చే కోణంలోనే  ఆలోచిస్తా. అయితే ఎలా చెప్పాలో తెలియడంలేదు. ఏం చేయమంటారు?

- ఓ సోదరి

 

సాధారణంగా బాస్‌లు లేదా పై స్థాయి అధికారులు ఇతరులు చెప్పే అభిప్రాయాలను దాదాపుగా వినడానికే ప్రయత్నిస్తారు. వాటి నుంచి పరిష్కారం ఉంటుందేమో అనే కోణంలో ఆలోచిస్తారు. అయితే చెప్పే విధానం సరిగ్గా ఉండాలి. అటువంటి సందర్భాల్లో ఏదైనా సమస్యకు సంబంధించి మీకు తోచిన సూచనను చెప్పడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులున్నాయి. అదెలాగంటే...

ఉద్వేగాలు వద్దు: ‘మీరంతా అనుకుంటున్న మార్గంలో వెళితే కొంత ఇబ్బంది ఎదురవుతుంది, ప్రస్తుత సమస్య నుంచి బయటపడాలంటే నాకు తెలిసి మరో మార్గం కూడా ఉందనిపిస్తోంది. అయితే ఇది కాస్త భిన్నం. ఒకసారి నా ఆలోచనల్ని పరిగణించమని కోరుతున్నా...’ అని అడిగి చూడండి. అయితే చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో మాట్లాడగలగాలి. ఎటువంటి ఉద్వేగాలకు లోనుకాకూడదు. ఎదుటివారు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారు. అంతేతప్ప గతంలోలా  మాట్లాడకూడదు. ఒకవేళ మీ అభిప్రాయాలను  ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఏకాంతంగా మీ బాస్‌ని కలిసి మాట్లాడాలి. లేదంటే మీ ఇరువురికే కాదు, సమావేశంలో ఉన్న అందరికీ ఆ సందర్భం ఇబ్బందికరంగా మారుతుంది.

సంస్థ గురించి : మీ ఆలోచనలను చెప్పేటప్పుడు సంస్థ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడగలగాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా ఉంటే... సమస్య పక్కదోవ పడుతుంది. అలాగే మీ అభిప్రాయాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలనే నియమం మీ బాస్‌కు లేదు. ఎందుకంటే చివరి నిర్ణయం ఆమెదే అవుతుంది. అయితే మీ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటే సంస్థకు మంచిదనే కోణంలో మీరు మాట్లాడగలగాలి. మొదటిసారి ఆమె మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఫరవాలేదు. మరోసారి చెప్పేందుకు ప్రయత్నించండి. అప్పుడు కూడా ఆమె అంగీకరించకుండా మరో నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మీరు కట్టుబడి ఉండాలి. కాబట్టి ఎదుటివారిని నొప్పించకుండానే మీ అభిప్రాయాన్ని చెప్పేందుకు ప్రయత్నించండి.

- మీ సందేహాలను vasucareer@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని