close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో హైదరాబాదీ!

ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’ (ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ) వేదికపై తమ డిజైన్లు ప్రదర్శించాలని కలలు కంటారు. హైదరాబాద్‌కు చెందిన  ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ కాలేజీ విద్యార్థిని 21 ఏళ్ల దీపాలి థోలియాకు ఆ కల త్వరలో నెరవేరనుంది. ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లాంచ్‌ప్యాడ్‌’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దీపాలి రూపొందించిన డిజైన్లు ఎంపికయ్యాయి. ఈ ఏడాది నవంబరులో జరుగనున్న ప్రదర్శనకు లాక్మే ఫ్యాషన్‌వీక్‌లో పాల్గొననుంది.  ప్రముఖులెందరో పాల్గొనే ఈ ప్రదర్శనలో తనకు అవకాశం దక్కడం సంతోషంగా ఉందంటోంది దీపాలి.

యూనిఫారంను కొత్తగా...
స్కూల్‌ యూనిఫారంను కొత్తగా చూపించడమే దీపాలికి ఈ అర్హతను తెచ్చిపెట్టింది. గళ్ల డిజైన్‌ను ప్రధానంగా తీసుకుని కొంచెం ట్రెండీగా, ప్రత్యేకంగా రూపొందించానంటుంది దీపాలి. ‘చిన్నప్పటి నుంచి దుకాణాల్లో కొనుగోలు చేసే రెడీమేడ్‌ దుస్తుల కన్నా, అమ్మ డిజైన్‌ చేసి కుట్టించినవే ఎక్కువగా వేసుకున్నా. వివాహాది వేడుకలకు, పండగలకు నా దుస్తులను అమ్మ డిజైన్‌ చేసేది. వస్త్రాల మేళవింపుతోపాటు ఆమె ఎంచుకునే వర్ణాలు అద్భుతంగా ఉండేవి. అప్పటి నుంచే దుస్తుల డిజైనింగ్‌పై ఇష్టం పెరిగింది. అమ్మ స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చా. చదువుకుంటూనే ప్రముఖ డిజైనర్లతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఇదంతా నా కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి, అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతోంది. రానున్న నవంబరులో నిర్వహించనున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో నా డిజైన్లను ప్రదర్శించబోతున్నా. ఆ రోజుకోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. నా కలెక్షన్‌లో ఆకట్టుకునే వర్ణాల్లో, చేతిపనితో భిన్న రకాల్లో డిజైను చేసిన యూనిఫారంలు ఉంటాయి. అన్ని వయసులవారికి, అన్ని సైజుల్లో దుస్తులను రూపొందించడమే నా లక్ష్యం’ అని అంటోంది  దీపాలి.


మరిన్ని