close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మీటూ.... కాదిది... ‘కూటూ’

అనేక కార్యాలయాల్లో మహిళలు ఎత్తుమడమల చెప్పులు వేసుకోవడం తప్పనిసరి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం తెలిసిందే. అందుకే దీనికి వ్యతిరేకంగా జపాన్‌లో ఓ ఉద్యమం ప్రారంభమైంది. అదే ‘కూటూ’. 

పాన్‌లో ఉద్యోగం చేసే మహిళలకు డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. ఆఫీసులో హై హీల్స్‌ వేసుకోవడమూ తప్పనిసరి. దీనివల్ల మహిళలు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా గళమెత్తింది ఆ దేశ నటి యుమి ఇషికవ. ‘శ్మశానంలో కూడా ఈ ఎత్తు మడమలు ధరించి పనులు చేయాలా?’ అంటూ చేసిన ట్వీట్‌ కాస్తా వైరల్‌ అయ్యింది. ఇదే ‘యాంటీ-హీల్స్‌’ ఉద్యమంగా మారింది. సామాజికమాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్‌ కూటూ పేరుతో హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌లో పందొమ్మిది వేల మందికి పైగా సంతకాలు చేశారు. చాలామంది ‘షూ-సైడ్‌’ హ్యాష్‌ట్యాగ్‌లు జత చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ పోరాటానికి మద్దతుగా హాలీవుడ్‌ తారలు జూలియా రాబర్ట్స్‌, క్రిస్టిన్‌ స్టీవార్ట్‌లు కేన్స్‌ మహోత్సవానికి చెప్పుల్లేకుండానే వెళ్లారు. జపాన్‌ భాషలో కుట్సు అంటే బూట్లని, కుట్సూ అంటే నొప్పి అని అర్థమట. ఈ రెండింటినీ కలిపి  ఈ ఉద్యమానికి కూటూగా నామకరణం చేశారు. దీనికి ‘మీటూ’నే స్ఫూర్తి. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన యుమీ నీలి రంగు స్నీకర్స్‌ వేసుకుని ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది.

‘ఈ తిరుగుబాటు సామాజిక దురాచారాలను రూపుమాపుతుందనుకుంటున్నా. పురుషుల్లా మహిళలూ ఫ్లాట్‌ చెప్పులు వేసుకోవడం చెడు పరిణామం కాదని చెప్పాలనుకుంటున్నా’ అని అంటుందామె. ఈ ‘యాంటీ-హైహీల్స్‌ ఉద్యమం’ 2016లో యూకేలో ప్రారంభమైంది. పని ప్రదేశాల్లో తప్పనిసరిగా ఎత్తు చెప్పులు ధరించాలి అనే నిబంధనను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌కు అప్పట్లో దాదాపు పదివేల మంది మద్దతు తెలిపారు. ప్రస్తుతం జపాన్‌లోని కూటూ ఉద్యమం కూడా దీన్నే అనుసరిస్తోందని చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలో కొంతమంది పురుషులు హైహీల్‌ మారథాన్‌ పోటీలు నిర్వహించి తమవంతుగా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు భారత్‌లోనూ దీనిపై చర్చ నడుస్తోంది. మనదేశంలోని ఇరుకైన రోడ్లు, రద్దీగా ఉండే బస్సులు, రైలు ప్రయాణాల్లో వీటిని వేసుకుని నడవడం చాలా కష్టం. పని ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి చెప్పులు వేసుకోవాలనే దానిపై మాట్లాడాల్సిన సమయమిదే అంటున్నారు ఇక్కడి అమ్మాయిలు.


మరిన్ని