close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నైపుణ్య సారథులు

16-25 ఏళ్ల వయసు... ఎదుగుదలలో చాలా కీలక దశ.

ఉన్నతంగా చదువుకుని స్థిరపడాలా... వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలా... అనే మీమాంసలో పడిపోయే వయసూ ఇదే. ఆ సమయంలో ఇచ్చే ఆసరా యువతకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఆసరానే ‘మెంటార్‌ టు గెదర్‌’పేరుతో ఉచితంగా అందిస్తోంది అరుంధతీ గుప్తా. యువతను విజయబాటలో నడిపిస్తూ ఎంతోమందికి చేయూతనందిస్తోంది.

భారతదేశంలో సగం జనాభా పాతికేళ్లలోపువారే. వారిలో దాదాపు నలభై నుంచి యాభైశాతం మందిలో ఆత్మన్యూనత ఉంటుంది. ఉద్వేగాలు ఎక్కువగా ఉండటం, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా రకరకాల సమస్యలు ఎదుర్కొనడం వారిలో మామూలే. అలాంటివారికి అండగా ఉండేందుకే ‘మెంటార్‌ టు గెదర్‌’ ఏర్పాటు చేశామంటుంది అరుంధతీ గుప్తా. ఈ స్వచ్ఛంద సంస్థ  బెంగళూరులో ఏర్పాటైనా హైదరాబాద్‌, చెన్నై, పుణె, దిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లోనూ సేవలు అందిస్తోంది. వీళ్ల లక్ష్యం 14 నుంచి 21 సంవత్సరాల లోపు యువతే.  ‘అప్పుడు నేను మాంచెస్టర్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నా. ఆ సమయంలో నాకు మెంటార్‌గా డాక్టర్‌ రాజీవ్‌గౌడ ఉండేవారు. చదువుకుంటూనే ఆయనతో కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. చాలా ఆనందంగా అనిపించేది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యువతకు మెంటార్‌ అవసరం    ఎంత ఉందో అర్థమైంది. విదేశాల్లో అలాంటి సంస్థలు ఉన్నాయి కానీ... మన దగ్గర తక్కువే. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. చదువైపోయాక భారత్‌ వచ్చి...ఆయన సహకారంతోనే ఈ సంస్థను 2009 చివర్లో ప్రారంభించా. మొదట పైలెట్‌ ప్రోగ్రాం నిర్వహించి తరువాత పూర్తిస్థాయిలో సేవల్ని అందుబాటులోకి తెచ్చాం...’ అని చెబుతుంది అరుంధతి.

భవిష్యత్తు దిద్దుకునేలా...

ఒక వ్యక్తిలో కౌమారదశ చాలా కీలకం. అప్పుడప్పుడే ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు. ఎన్నో తెలుసుకుంటూ, నేర్చుకోవాల్సిన దశా ఇదే. కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, చదువు లేకపోవడం వంటివాటివల్ల వాళ్లు అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఒకవేళ పిల్లలు చదువుకుంటున్నా... ఈ 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు వాళ్లలో లేవు. యువతకే కాదు... ఎవరికైనా సరే కొన్నిరకాల నైపుణ్యాలు వచ్చి ఉంటేనే వారు కోరుకున్న రంగంలో రాణించగలుగుతారు.  అవేవీ పాఠశాలల్లో చెప్పరు. పుస్తకాలు చదివితే వచ్చేవి కావు. ఇతరుల్ని చూసి నేర్చుకోలేరు. ముఖ్యంగా సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించడం, సవాళ్లను స్వీకరించడం, సమయపాలన... ఇలాంటివన్నీ ఆ నైపుణ్యాల జాబితాలోకి వస్తాయి. యువతలో కొరవడుతున్న ఇలాంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తుందీ సంస్థ.

రెండు రకాలుగా...

ఈ సంస్థ రెండురకాలుగా పనిచేస్తుంది. కౌమారదశ అంటే 13-15 ఏళ్ల లోపువారి కోసం ప్రత్యేకంగా లైఫ్‌ స్కిల్స్‌ శిక్షణను మూడేళ్లపాటు అందిస్తుంది. సాధారణ విద్యార్థులతోపాటు, ప్రభుత్వ పాఠశాలలు, పేదపిల్లలకు ఆశ్రయమిచ్చే ఎన్జీవోలు, ఆశ్రమాలతో కలిసి పనిచేస్తుంది. వాళ్లు తమ కెరీర్‌ని తీరిదిద్దుకునేలా ప్రోత్సహిస్తుంది. 18 -21 ఏళ్ల లోపువారిని ఎంపిక చేసి దాదాపు ఎనిమిది నెలల పాటు వాళ్లకు అవసరమయ్యే నైపుణ్యాలు నేర్పిస్తుంది. వ్యక్తిగతంగానే కాదు, బృందంగానూ యువత శిక్షణ తీసుకోవచ్చు. ఇప్పుడు మెంటార్‌ టు గో యాప్‌ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆ యాప్‌ ఆధారంగా మెంటార్లను నేరుగానే సంప్రదించొచ్చు అని చెబుతారు నిర్వాహకులు. ‘చాలామంది పిల్లలు పెద్దవాళ్లు ఏం చెప్పినా వినిపించుకోరు. మాకు తెలీదా అని అనుకుంటారు. వాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కాకుండా స్నేహభావంతో ఉంటేనే మాట వింటారు. చెప్పినట్లు చేస్తారు. మేం అలా స్నేహభావంతో వ్యవహరించే మెంటార్లను అందిస్తాం. వాళ్ల అనుభవాలు, జీవితం నుంచి పిల్లలు నేర్చుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడే విధానం, నడక, పనిచేసే తీరు... వంటివన్నీ మెంటార్లతో మాట్లాడుతూ, తెలుసుకుంటారు.  యువతను తిట్టకుండా మన ఆలోచనల్ని రుద్దకుండానే వారిలో ఉద్వేగాల పరంగా మార్పు తేవాలి. భవిష్యత్తు తీర్చిదిద్దుకునేలా తర్ఫీదు ఇవ్వాలి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం, క్రిటికల్‌ థింకింగ్‌, చేసుకోవాల్సిన మార్పులు, విలువలు, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవడం... వంటివన్నీ మేం అందించే మెంటారింగ్‌లో భాగమే. కెరీర్‌పరంగానూ సలహాలూ ఉంటాయి..’ అని వివరిస్తుందామె.

ఎవరైనా మెంటార్‌ కావొచ్చు...

ఈ సంస్థ అందించే సేవలు పూర్తిగా ఉచితం. ‘మెంటార్‌గా చేయాలనుకునేవారు ఈ యాప్‌లో నమోదు చేసుకుంటే... వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు స్క్రీనింగ్‌ చేస్తారు. అర్హత ఉందనుకుంటే కొంత శిక్షణ ఇచ్చి, మెంటారింగ్‌ ఎలా చేయాలో నేర్పిస్తారు. నిర్వాహకులకు నమ్మకం కలిగాక మెంటారింగ్‌ కోరుకునేవారిని అప్పగిస్తారు. అది ఒకరు కావొచ్చు. ఇద్దరు కావచ్చు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, సాఫ్ట్‌వేర్‌ వంటి రంగాలకు చెందినవారు  ఈ సంస్థతో కలిసి మెంటార్లుగా సేవలు అందిస్తున్నారు. మెంటార్లు పెద్దపెద్ద విజయాలు సాధించాల్సిన అవసరంలేదు. బృందాన్ని నడిపించే స్థాయిలో ఉన్నా నిర్వాహకులు ఎంపికచేస్తారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌లో టీంలీడర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి మెంటారింగ్‌ చేస్తున్నాడు. టీంలీడర్లు, ఒకస్థాయి ఉద్యోగులకు హైస్కూల్‌ విద్యార్థుల్ని అప్పగిస్తారు. వాళ్లు విద్యార్థులకు జీవననైపుణ్యాలు నేర్పిస్తూనే కెరీర్‌ పరంగా సలహాలు ఇస్తారు. కాస్త పెద్దస్థాయి వ్యక్తులకు కాలేజీ విద్యార్థులను అప్పగిస్తారు. ఈ మెంటార్లు ఎక్కడినుంచైనా పనిచేయొచ్చు. పిల్లల్ని, వాళ్ల సమస్యల్ని అర్థంచేసుకోవాలి. సమస్యలు మెంటార్‌కి చెబితే పరిష్కారం అవుతాయనే నమ్మకం విద్యార్థుల్లో కలిగించాలి ఈ మార్గదర్శకులు. స్కూలు విద్యార్థులకు మూడేళ్లపాటు శిక్షణ ఉంటే, యువతకు ఎనిమిది నెలలు ఉంటుంది.

హైదరాబాద్‌లోనూ...

మేం కిందటి సంవత్సరమే హైదరాబాద్‌లోనూ మా సేవల్ని విస్తరించాం. 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఎనిమిది నెలల మెంటారింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు సిస్కో, టాస్క్‌ సాయం అందిస్తున్నాయి.  ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 333 మంది విద్యార్థుల్ని చేరుకున్నాం. ఇక్కడి   విద్యార్థుల్ని గుర్తించేందుకు టాస్క్‌ సాయం చేసింది. ప్రస్తుతం శ్రీచైతన్య, ఏస్‌ కాలేజీ, స్ఫూర్తి డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మెంటారింగ్‌ చేస్తున్నాం. సిస్కో సాయంతోనే మొబైల్‌ మెంటారింగ్‌ యాప్‌ని అందుబాటులోకి తెచ్చాం. మేం ఇంజినీరింగ్‌, కామర్స్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పనిచేస్తాం. ఇప్పటివరకూ మొత్తంగా 2500 మంది విద్యార్థుల్ని చేరుకున్నాం. ఇందుకోసం విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోం. మాకు కార్పొరేట్‌ సంస్థలు, సిస్కో నిధులు సమకూరుస్తుంది.

మరిన్ని